తెలంగాణలో భారీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే. అందులో భాగంగానే గ్రూపు-1, గ్రూపు-2 పోస్టుల భర్తీకి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తి చేసారు. తాజా సమాచారం మేరకు తొలుత గ్రూపు-1 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నోటిఫికేషన్ విడుదలపై శనివారం టీఎస్‌పీఎస్సీ ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గ్రూపు-1పై ఇప్పటికే దశల వారిగా సమావేశాలను కమిషన్ నిర్వహించింది. ఈ అంశంపై మరొకసారి సమావేశం అవుతుంది.
ముఖ్యంగా అన్నిశాఖలను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్చించింది. మూడు వారాల కిందటే గ్రూపు-1 నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో అది వాయిదా పడింది. కొత్త జోనల్ వ్యవస్థ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా కమిషన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది. మరోవైపు ఇంటర్వ్యూల రద్దును కొందరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేవిధంగా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులుండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు.. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించేవారు. గ్రూపు-2 విషయానికి వస్తే రాత పరీక్షకు 600 మార్కులు, ఇంటర్వ్యూలకు 75 మార్కులుండేవి. 675 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేసేవారు.
ప్రస్తుతం ఇంటర్వ్యూలను రద్దు చేసిన తరుణంలో రాత పరీక్షలో ఏమైనా మార్పులుంటాయా..? అన్న సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇంటర్వ్యూలకు ఇప్పటివరకు కేటాయించిన మార్కులను రాత పరీక్షకు కేటాయించే అవకాశం ఉందా..? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే పరీక్ష పేపర్ మోడల్ కూడా మారే అవకాశముంది. నోటిఫికేషన్ల విడుదల కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు. గ్రూపు-1 ను 900 మార్కులకు, గ్రూపు-2 600 మార్కులకు నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో నియామక ప్రక్రియ అతి తొందరలోనే ప్రారంభమయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి :
CBSE Board Exams : సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్‌లో కీలక మార్పులు.. సిలబస్ కూడా..!
“స్వాతిముత్యం”లో కమల్ హాసన్ భార్య దీప ఇప్పుడు ఎక్కడ ఉందో… ఏం చేస్తుందో తెలుసా..!