Home » గద్దర్ కి ఆ పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసా ? 

గద్దర్ కి ఆ పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసా ? 

by Anji
Ad

ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ  తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. తన పాటతో సంపాదించుకున్న కోట్లాది మంది అభిమానులను శోక సంద్రం ముంచారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ లో జన్మించారు గద్దర్. తల్లిదండ్రులు గుమ్మడి లచ్చువమ్మ, శేషయ్య. వీరికి ఐదో సంతానమే విఠల్ రావు. ఉన్నత పాఠశాల విద్య వరకు తూఫ్రాన్ లో, ఆ తరువాత మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొని జైలుకు వెళ్లారు. తొలుత కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరారు. ఆ తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

Advertisement

ప్రారంభంలో అంబేద్కర్ పై, అల్లూరి సీతారామారాజుపై బుర్ర కథలు చెప్పారు. ఒగ్గుకథ, బుర్రకథ, ఎల్లమ్మ కథలను ప్రజలకు చెప్పే కళాకారుడిగా సాంస్కృతిక చైతన్యాన్ని ప్రారంభించారు. మరోవైపు మావోయిస్ట్ ఉద్యమనేత కొండపల్లి సీతారామయ్య పొలిటికల్ క్లాస్ విన్న తరువాత గద్దర్ జన నాట్యమండలిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. అదేవిధంగా అప్పటి నక్సల్ నాయకుడు పరిటాల శ్రీరాములుతో కలిసి ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 45 రోజులు పోలీసుల కస్టడిలో ఉన్నారు. 1985 వరకు సాంస్కృతిక ఉద్యమం నడిపించి.. 1990 వరకు అండర్ గ్రౌండ్ ఉద్యమంలో పోరు కొనసాగించారు. 1990 ఫిబ్రవరి 19న ఆరేళ్ల  అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 1997లో ఆయనపై బుల్లెట్ల వర్షం కురిసింది. 2004లో నక్సల్స్ తో ప్రభుత్వం జరిపిన చర్చల్లో నక్సలైట్ల ప్రతినిధులుగా వరవరరావుతో కలిసి పాల్గొన్నారు గద్దర్. 2010లో 107 ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేశారు.

Advertisement

ఇదిలా ఉంటే.. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఈ పేరు చాలా మందికి అంతగా తెలియదు. కానీ గద్దర్ అంటే తెలియని వారు లేరు. కొంత కాలానికి విఠల్ రావు పేరులోని రావుని తొలగించుకొని గుమ్మడి విఠల్ గా మారారు. అయితే సినీ దర్శకుడు బి.నరసింగరావు ప్రోత్సాహంతో 1971లో మొదటి పాట ‘ఆపర రిక్షా’ అనే పాట రాశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు రచనల సందర్భంగా తాను రాసిన పాట కింద పేరు రాయాల్సి వచ్చినప్పుడు గుమ్మడి విఠల్ కాకుండా వేరే పేరు రాయాలనుకున్నాడట. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఓ వెలుగు వెలిగిన గదర్ పార్టీ పేరును గదర్ గా మార్చుకున్నారు. అది ప్రింటింగ్ లో పొరపాటున గద్దర్ అని ప్రచురితమైంది. నాటి నుంచి నేటి వరకు గద్దర్ గానే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక  గద్దర్ ఎక్కడికి వెళ్లినా పట్టుకెళ్లే కర్ర తన తండ్రి శేషయ్యది.  తొలుత దానికి బుద్ధుడి జెండా ఉండేది. ఇంజినీరింగ్ కళాశాల చేరిన తరువాత ఎర్రజెండా చేరింది. గద్దర్ ని ప్రజా యుద్ధనౌక అని 1989లో ఓ పత్రిక ఎడిటర్ సంబోధించగా..అదే ఆయనకు బిరుదుగా మారింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

గద్దర్ శరీరంలో 26 ఏళ్లుగా బుల్లెట్.. అయినా ఆగని గళం

ఆదివారం రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి పనులు చేయకూడదు.. చేస్తే అంతే సంగతులు..!

Visitors Are Also Reading