సాధారణంగా భారతదేశంలో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు ఉండే క్రేజే వేరు ఉంటుంది. అభిమాన స్టార్లు, క్రీడాకారుల కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటారు. వారిని చూడడం కోసం ఎంత దూరమైన వెళ్తారు. తాజాగా అభిమాన హీరో కోసం ఓ వ్యక్తి చేసిన పని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అభిమాన హీరో మృతి చెందితే ఆ వ్యక్తి ఏకంగా హీరో పెద్ద కర్మ నిర్వహించి.. తాను ఉండే ప్రాంతంలో అందరికీ భోజనం ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అతన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రాజాంలో చోటు చేసుకుంది.
Advertisement
విజయనగరం జిల్లాలోని రాజాం, వస్త్రపురి కాలనీకి చెందిన గొట్టాపు వెంకటరావు అనే వ్యక్తి స్థానిక వరలక్ష్మీ జ్యూట్ మిల్ లో టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు. అతనికి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంత పిచ్చో మాటల్లో చెప్పలేం. కృష్ణ కి వీరాభిమాని అయినటువంటి వెంకటరావు సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందాడనే వార్త విని చాలా బాధపడ్డాడు. తన ఇంట్లో వ్యక్తి మృతి చెందితే ఎంత బాధ పడుతారో అంతలా బాధపడ్డాడు. తన అభిమాన హీరో గురించి స్నేహితుల వద్ద చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. పెద్ద కర్మ జరపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తాను నివాసముంటున్న కాలనీలో ప్రతి ఇంటికీ వెళ్లి వారిని భోజనానికి ఆహ్వానించాడు. కాలనీవాసులు కూడా భారీగానే తరలివచ్చారు. అభిమాన నటుడిపై వెంకటరావు చూపిస్తున్న ప్రేమకి వారంతా ఆశ్చర్యపోయారు.
Advertisement
Also Read : దర్శకుడు పూరిజగన్నాథ్ ఆస్తులు పోవడానికి అసలు కారణం వెల్లడించిన ఆకాశ్ పూరి
ఈ సందర్భంగా వెంకటరావు మీడియాతో మాట్లాడారు. ‘‘నాకు ఊహ తెలిసిన అప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమానిని. కృష్ణ మృతి చెందాడనే వార్త విని ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబ సభ్యుల మాదిరిగానే నేను కూడా నా అభిమాన హీరో పెద్ద కర్మ నిర్వహించాలని భావించాను. నా శక్తి మేరకు కాలనీవాసులకు భోజనాలు ఏర్పాటు చేశాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపాడు. ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు స్థానిక మహేష్ బాబు అభిమానులు, జ్యూట్ మిల్లో తన సహచర ఉద్యోగులు తమవంతు సహకారం అందిచారని వెల్లడించారు వెంకటరావు. బిర్యానీ, చికెన్ తో వెంకటరావు విందు ఏర్పాటు చేయడం విశేషం.
Also Read : పునీత్ రాజకుమార్ సహా చిన్నవయసులోనే కన్నముసిన కన్నడ స్టార్ హీరోలు..! అదే శాపంగా మారిందా..?