పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను ఏపీ ప్రభుత్వం వెంటాడుతోంది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇవాళ హైదరాబాద్ యూసూఫ్‌గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మరొక వైపు ఏపీలో భీమ్లానాయక్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాలలో భీమ్లానాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీ చేశారు. పాత ధరలకే టికెట్లను విక్రయించాలంటూ ఎగ్జిబిటర్లకు అధికారులు ఫోన్ చేశారు.
Advertisement
Advertisement
దీంతో ఎగ్జిబిటర్లలో ఆందోళన మొదలైంది. లక్షలు పెట్టి సినిమాను కొనుగోలు చేస్తే ప్రభుత్వ నిర్ణయంతో తమపై తీవ్ర భారం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా నిర్ణయముంటుందని ప్రముఖులు వెల్లడించారు. ప్రభుత్వం వేసిన కమిటీతో పాటు సీఎం జగన్‌ను కలిసి సినిమా సమస్యలు టికెట్ల ధరలపై చర్చించారు. చిరంజీవి, మహేశ్, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి, అలీ వంటి ప్రముఖులు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్‌తో భేటీ అయ్యారు.
మంత్రి పేర్ని నాని సమక్షంలో సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చర్చలు సానుకూలంగానే జరిగాయని చెప్పారు. సినిమా విడుదలపై చిత్ర నిర్మాతలు, హీరోలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మరొకసారి ఏపీ ప్రభుత్వం భీమ్లానాయక్ సినిమాకు ఝలక్ ఇచ్చింది. పాత విధానమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పవన్ కల్యాణ్ అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడుతున్నారు.
Also Read : ఆర్.నారాయణమూర్తి ఇల్లు ఎక్కడ..? ఎలా ఉందో తెలుసా..?