తెలంగాణలోని ములుగు జిల్లా ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగు అవుతున్న కొద్ది ములుగు ప్రాంతం మెల్లమెల్లగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ప్రధానంగా ములుగు ప్రాంతంలోని యువత స్వయం ఉపాధిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి రంగాన్ని ఎంచుకోవాలి.. ఎలా ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి చూపించాలని.. పెట్టుబడి విషయంలో ఆర్థిక సమస్యతో పలు సందేహాలతో సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసమే ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరువతో ములుగు జిల్లాలోని యువతి, యువకులకు పీఎంఈజీపీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
Advertisement
ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పీఎంఈజీపీ పథకంపై ఫిబ్రవరి 02న కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ ములుగు 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం అవుతుంది. ఉన్నత విద్యనభ్యసించి పారిశ్రామిక రంగంలో రాణించాలంటే యువతకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం చేయూతనిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం జిల్లా పరిశ్రమల శాఖ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ), ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు సంయుక్తంగా అమలుకి పని చేస్తున్నాయి.
Advertisement
యువతకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పిస్తూ.. పారిశ్రామిక, సేవా రంగాలలో బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసి యువతకు తోడ్పాటునందిస్తోంది. ఇక ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. తయారీ రంగ పరిశ్రమలకు రూ.50లక్షల లోపు, సేవా రంగ రూ.25లక్షల లోపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మహిళలకు 5శాతం, జనరల్ అభ్యర్థులు 10 శాతం తొలుత పెట్టుబడి వ్యయంగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాలలో 35 శాతం రాయితీలను అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
Advertisement