Home » సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆఫర్ కు నళిని స్పందన ఏంటో తెలుసా ?

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆఫర్ కు నళిని స్పందన ఏంటో తెలుసా ?

by Anji

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం ఏ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీ.ఎస్, డీజీపీలను ఆదేశించారు. అయితే సీఎం రేవంత్ చేసిన ఈ ఆఫర్ కు నళిని స్పందించారు.

ఈ విధంగా లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ తరుణంలో గతం ఓ రీల్ లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా.. సోషల్ స్టిగ్మా ను మోసాను. ఆ నాటి ప్రభుత్వం మూడేండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. తెలంగాణ ఉద్యమం కోసం డిసెంబర్ 09, 2009 చేసిన రాజీనామా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య మహిళా దినోత్సవం రోజు నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్టు ప్రకటిస్తే.. నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్ మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 

18 ఏండ్లు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసిపైనే నమ్మకం పోయేవిధంగా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి, నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ ప్లనేషన్స్ రాయమనడం అడ్వర్స్ రిమార్క్ రాయడం బ్యాచ్లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్ టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి.  ఉమ్మడి రాష్ట్రంలో నాకు అపాయింట్ మెంట్ దొరకలేదు. 01-11-2011న డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంతో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ.. నా ఉద్యమ కార్యచరణ ప్రకటించాను. అప్పటి ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. అయితే 12 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత తెలంగాణ మూలాలు కలిగిన ఒక ముఖ్యమంత్రిగా మీరు నా కేస్ ను వెలికి తీశారు.  చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నాననే విషయాన్ని ప్రజలకు అర్థం అయింది. నిజం నిలకడగా తెలుస్తుందనేది నిరూపితమైంది. 

 

రెండేండ్ల కిందట దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడే కష్టాలను పడ్డాను. నేను ఎవ్వరి కోసం ఇంకా ఎటువంటి త్యాగం చేయలేను. ప్రస్తుతం వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. దీంతో నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడవచ్చు. మీరు భావిస్తున్నట్టువంటి పోలీస్ ఉద్యోగం నేను చేయలేను. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించాడు. చివరగా నేను సీఎం గారిని కోరేది ఏమిటంటే.. నా పై కరుణ చూపి స్టేటస్ కో అనుమతించండి. నాలా మరే ఆఫీసర్ కూడా డిపార్ట్ మెంట్ లో  ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. నాకు మీరు న్యాయం చేయాలంటే.. నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులు నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని చెప్పింది నళిని.  ప్రస్తుతం సోషల్ మీడియాలో నళిని బహిరంగ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading