Home » అమ్మోర్ ర‌ష్ చూసి తీసుకెళ్లి చెత్త కుప్ప‌లో ప‌డేసిన నిర్మాత‌.. ఇక ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

అమ్మోర్ ర‌ష్ చూసి తీసుకెళ్లి చెత్త కుప్ప‌లో ప‌డేసిన నిర్మాత‌.. ఇక ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

by Anji
Ad

త‌లంబ్రాలు, ఆహుతి, అంకుశం ఇలా వ‌రుసగా మూడు హిట్ సినిమాలు తీసిన త‌రువాత ఆగ్ర‌హం రూపంలో ఎదురు దెబ్బ త‌గ‌ల‌డాన్ని ఆయ‌న త‌ట్టుకోలేక‌పోయారు. ఆ బాధ నుంచి విముక్తి కోసం ఆయ‌న అమెరికా వెళ్లారు. ఆయ‌న మ‌న‌సులో మాత్రం ఆ గంద‌ర‌గోళం త‌గ్గ‌లేదు. అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జికి సంబంధించి ఓ స‌మావేశం జ‌రుగుతుంద‌ని తెలిసి అక్క‌డికి వెళ్లారు. అక్క‌డ ఓ కొత్త వ్య‌క్తి ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న పేరు లిన్ ఉడ్ డ‌న్. హాలీవుడ్ సినిమాల్లో స్పెష‌ల్ ఎఫెక్ట్ సినిమాల‌కు ఆధ్యుడు. అదేవిధంగా ఆ ఏడాది ఆస్కారు అవార్డు ఎంపిక సంఘం స‌భ్యుడు.


ఆయ‌న‌తో క‌లిసి టెర్నినెట‌ర్-2 సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లారు శ్యామ్‌. అది చూసి బ‌య‌టికి వ‌చ్చాక ఏదో వింత‌లోకంలో ఉన్నారు. తెలుగులో కూడా గ్రాఫిక్స్‌తో కూడిన ఓ సినిమా చేయాల‌ని శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి ఆలోచ‌న‌లు మొద‌ల‌య్యాయి. ఇక స్పెష‌ల్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తి కూడా మొద‌లైంది. అమెరికా నుంచి హాంకాంగ్, సింగ‌పూర్, కొలొంబో,లండన్ వెళ్లారు. నెల రోజుల పాటు విశ్రాంతి కోసం అని వెళ్లిన శ్యామ్ ఓ కొత్త ప్రాజెక్ట్‌తో హైద‌రాబాద్‌లో దిగారు. త‌న ఎం.ఎస్‌. ఆర్ట్స్ మూవీ యూనిట్‌తో క‌లిసి ఓ క‌థ త‌యారు చేశారు. వై.రామారావుకు ద‌ర్శ‌కుడిగా అవకాశం ఇచ్చారు. సంగీత ద‌ర్శ‌కుడిగా చ‌క్ర‌వ‌ర్తి, కెమెరామెన్ విజ‌య‌శ్రీ కుమార్, ఆరోజు న‌టుడు బాబు మోహ‌న్ శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డిని క‌ల‌వ‌డానికి వ‌చ్చాడు. మాటల్లో మ‌న‌వ‌రాలి పెళ్లాం సినిమా మ‌ర‌ద‌లుగా కొత్త అమ్మాయి చేస్తుంది. ఆమెను క‌థానాయిక‌గా తీసుకుంటే బాగుంటుంద‌ని సూచించాడు. ఆమె మ‌రెవ్వ‌రో కాదు. హీరోయిన్‌ సౌంద‌ర్య‌. హీరోగా సురేష్, విల‌న్‌గా చిన్న‌, అమ్మ‌వారి పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ‌, ఇత‌ర పాత్ర‌ల‌కు బాబు మోహ‌న్‌, క‌ళ్లు చిదంబ‌రం, బేబీ సున‌య‌న త‌దిత‌రులు న‌టించారు.

Advertisement


1992 జూన్ 22న మ‌ద్రాస్ లోని కోదండ పాణి రికార్డింగ్ థియేట‌ర్‌లో పాట‌ల రికార్డింగ్ చేశారు. ఆ త‌రువాత జులై 02వ వారంలో తూర్పుగోదావ‌రి జిల్లా ముక్తేశ్వ‌రం తాలుకా ఐన‌వెల్లి గ్రామంలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. హైద‌రాబాద్‌లో మ‌రో షెడ్యూల్ తీశారు. మ‌రొక 10 రోజులు కోస్తాంద్ర‌లో సినిమాను చిత్రీక‌రించారు. మొత్తం 70 రోజుల్లో ఒక పాట మినహా సినిమా మొత్తం పూర్త‌యింది. ఇక గ్రాఫిక్స్ కావాలి. అమ్మోరు పాత్ర‌కు సంబంధించి స్పెష‌ల్ ఎఫెక్ట్ కోసం శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి లండ‌న్ వెళ్లారు. అక్క‌డికి వెళ్లాక‌ సినిమా మొత్తం ర‌ష్ చూశారు. ఎందుకో ఆయ‌న‌కు సంతృప్తి క‌లుగ‌లేదు. తాను అనుకున్న ఎఫెక్ట్ రాలేద‌ని ఆ సినిమాను క్యాన్సిల్ చేశారు. డ‌బ్బుల‌న్ని వృథా అని ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసి హైద‌రాబాద్ వ‌చ్చారు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది. ఇక శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్డికి ఏమి చేయాలో అర్థం కావ‌డం లేదు. ఎలాగైనా ఈ స్టోరీతోనే సినిమా తీయాల‌ని అనుకున్నాడు. త‌మ ఆస్థాన ద‌ర్శ‌కుడు అయిన కోడిరామ‌కృష్ణ ను పిలిపించి మొత్తం సినిమా తీయ‌మ‌ని అడిగాడు.


ఈ సినిమాలో విల‌న్‌గా రాంరెడ్డిని తీసుకున్నారు. మిగ‌తా వారంద‌రూ మామూలే. త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగా మ‌ళ్లీ పాట‌ల‌ను రికార్డ్ చేయించుకున్నారు. గ్రాఫిక్స్ ప‌రంగా ఒక్కో షాట్ తీయ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఈ సినిమా కోసం క్రిష్ లండ‌న్ నుంచి వ‌చ్చి ఏడాది శ్యామ్ ఇంట్లో ఉండి గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. ఒక తెలుగు చిత్రానికి విదేశీ సాంకేతిక నిపుణుడు పూర్తిగా ప‌ని చేయ‌డం ఇదే తొలిసారి. ఒక్కోషాట్ మూడు సార్ల‌కు పైగా ప్ర‌య‌త్నిస్తే త‌ప్ప స‌రిగ్గా వచ్చేది కాదు. ఈ చిత్రంలో స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌తో పాటు స్పెష‌ల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా లండ‌న్ స్టూడియోలోనే రూపొందించారు. చ‌క్ర‌వ‌ర్తి అనారోగ్యం బారిన ప‌డ‌డంతో ఆయ‌న కుమారుడు శ్రీ నిర్వ‌హించారు. దాదాపు రూ.1కోటి 80 రూపాయ‌ల వ్య‌యంతో సినిమా మొత్తం ఖ‌ర్చు కాగా.. అందులో గ్రాఫిక్స్ కోసం రూ.1కోటి20 ల‌క్ష‌లు ఖ‌ర్చు కావ‌డం విశేషం.

Advertisement

1995 న‌వంబ‌ర్ 23న అమ్మోరు సినిమా విడుద‌ల అయింది. మొద‌టి రెండు వారాలు మోస్తారుగా న‌డిచింది. ఇక ఆ త‌రువాత అమ్మోరు బాక్సాఫీస్‌కే పూన‌కం తెప్పించింది. క‌ష్టాలు ప‌డుతున్న ఓ భ‌క్తురాలిని ఓ చిన్నారి రూపంలో అమ్మోరు ఎలా కాపాడింద‌నేది క‌థ‌. గ్రాఫిక్స్‌ను ఇంత భారీ స్థాయిలో వాడుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావ‌డం విశేషం. చాలా తెలివిగా వాడుకున్నారు. సాంకేతిక దృశ్యాలు ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌గా అనిపించి థ్రిల్ గురిచేశాయి. ఇక సినిమాలో క్లైమాక్స్ అయితే అద్బుతంగా ఉండ‌డంతో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. మూడ న‌మ్మ‌కాల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు సైతం ఈ సినిమాను మ‌ళ్లీ మ‌ళ్లీ చూశారు. అయితే ఇందులో స్పెష‌ల్ ఉంది. క్లైమాక్స్‌లో త‌న ఐదు చేతులు పైకి ఎత్తే స‌న్నివేశం ఉంటుంది. అది గ్రాఫిక్స్ కాదు. అదంతా ఎడిట‌ర్ కృష్ణారెడ్డి ప్ర‌తిభ‌. 5 ఫిలింల‌ను క‌లిపి దానిని సృష్టించారు. హాలీవుడ్ గ్రాఫిక్స్ టెక్నిషియ‌న్‌ క్రిష్ కూడా ఈ స‌న్నివేశం చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. అమ్మోరు త‌రువాత తెలుగులో గ్రాఫిక్స్ ఉప‌యోగించ‌డం అధిక‌మైపోయింది.

ఈ సినిమాలో బేబీ సున‌య‌న పాత్రకు గొప్ప ప్ర‌తిస్పంద‌నే వ‌చ్చింది. అమ్మోరుగా ర‌మ్య‌కృష్ణ న‌ట‌న ప‌లువురి ప్ర‌శంస‌ల‌ను పొంద‌డ‌మే కాకుండా.. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక జ్యూరి బ‌హుమ‌తి కూడా ల‌భించింది. దేవ‌త పాత్ర పోష‌ణ‌లో కె.ఆర్.విజ‌య త‌రువాత అంత‌టి పేరు సంపాదించుకుంది ర‌మ్య‌కృష్ణ‌. ఆమెను అమ్మ‌వారిగా పెట్టిఎన్నో సినిమాలు తీశారు. రాంరెడ్డి ఆ త‌రువాత విల‌న్‌గా పుల్‌బిజీ అయిపోయారు. అమ్మోరు కోసం సౌంద‌ర్య 120 కాల్సిట్లు ఇచ్చారు. అప్పుడు ఆమె తీసుకున్న పారితోష‌కం కేవ‌లం రూ. 40,000 మాత్ర‌మే. సినిమా విడుద‌లైన త‌రువాత రూ.ల‌క్ష ఇవ్వ‌బోతే ఆమె తీసుకోలేదు. త‌న మూడ‌వ సినిమాగా దీనిని ఒప్పుకుంటే చివ‌రికీ 27వ సినిమాగా విడుదలైంది.


అమ్మోరు విడ‌ద‌ల‌య్యే లోపు దాదాపు 25 సినిమాల్లో న‌టించింది సౌందర్య‌. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని సౌంద‌ర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ చెప్పేవారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆ సినిమా విడుద‌ల కాక ముందే ఆయ‌న చ‌నిపోయారు. అమ్మోరు విజ‌యంతో సౌంద‌ర్య స్థాయి అమాంతం పెరిగిపోయింది. కోడి రామ‌కృష్ణ‌లో కొత్త కోణం క‌నిపించింది. తెలుగులో గ్రాఫిక్స్ సినిమా చేయాలంటే ఆయ‌న త‌రువాతే ఎవ‌రైనా అన్నంత‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తీసిన శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డికి ఓ ప్ర‌శ్న ఎదురైంది. చ‌దువుకున్న మీరు క్షుద్ర‌శ‌క్తుల సినిమా తీయ‌డం ఏంటి అని చాలా మంది అడిగారు. మూడ న‌మ్మ‌కాల‌ను పెంచే ఉద్దేశంతో ఈ సినిమా చేయ‌లేద‌ని.. హాలీవుడ్ సినిమా స్థాయిలో తెలుగు సినిమా చేయాల‌నే ఏకైక ల‌క్ష్యంతో నిర్మించాన‌ని చెప్పారు. హింది, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, ఒరియా, బెంగాళి వంటి భాష‌ల్లోకి ఈ చిత్రం అనువాదం అయింది. అక్క‌డ కూడా ప్ర‌జాద‌ర‌న పొందింది. ఇక ఆస్ట్రేలియ‌న్ ఛానెల్ కూడా ఈ చిత్రం ప్ర‌సార‌మైంది. భార‌తీయ దేవ‌త‌ల‌కు సంబంధించిన ఉత్స‌వంలో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇది అమ్మోరు సినిమా ప్లాష్ బాక్.

Also Read : 

కొత్త‌గా పెళ్లి జ‌రిగిన మ‌హిళ‌లు అధికంగా గూగుల్ లో ఏమి సెర్చ్ చేస్తున్నారో తెలుసా..?

మహేష్ బాబు మూవీలో విలన్ గా నటించే అవకాశాన్ని కోల్పోయిన గోపిచంద్…ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఎదో తెలుసా ?

 

Visitors Are Also Reading