తెలంగాణ రాజకీయాలపై కాంగ్రెస్ హైకమాండ్ పట్టు బిగిస్తుంది. పార్టీలో నేతల వ్యవహార శైలి పైన కన్నేసింది. రాష్ట్రంలో పార్టీకి వాతావరణం అనుకూలగా మారుతున్న వేళ ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకుటుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, నేతల వ్యాఖ్యలపైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంది. పార్టీ మేనిఫెస్టో మొదలు టికెట్ల ఖరారు పైనా తాజాగా పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో ఉంటుందని, వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో టికెట్ల పైన ఎవరు హామీ ఇచ్చినా అంతిమ నిర్ణయం పార్టీ హైకమాండ్ దేనని నేతలకు తేల్చి చెప్పింది.
Advertisement
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి పార్టీ సిద్ధంగా లేదు. ఎలాగైనా అధికారంలోకి రావటమే లక్ష్యంగా మినిట్ టు మినిట్ పార్టీ వ్యవహారాలపైన మైక్రో లెవల్ నుంచి సమాచారం సేకరిస్తోంది. టీపీసీసీ చీఫ్ తో సహా ఏ స్థాయి నేత అయినా పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో గత తొమ్మిదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగిన అంశాన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదికలు ఇచ్చాయి. దీనికి అనుగుణంగా ఏ ఒక్కరినీ విస్మరించకుండా అందిరికీ సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా మేనిఫెస్టో రూపకల్పనకు పార్టీ సిద్ధం అవుతోంది. పేదలు, మధ్య తరగతి, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఇదే సమయంలో పార్టీ టికెట్ల పైన కొందరు నేతలు హామీలు ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కొందరు ముఖ్య నేతలు తామే టికెట్లు ఇప్పిస్తామంటూ చెబుతున్న మాటలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. గెలుపే ప్రామాణికంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఖరాఖండిగా పార్టీ ముఖ్య నేతలకు తేల్చి చెప్పింది. నేతల సిఫార్సులకు ప్రాధాన్యత ఉండదని స్పష్టం చేసింది. నేతల వారసులకు కాని, అనుచరులకు కాని టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటూ పార్టీ నాయకత్వం కుండ బద్దలు కొట్టింది. ప్రాంతీయ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూనే గెలుపు మాత్రమే లక్ష్యంగా టికెట్ల ఖరారు ఉంటుందని తేల్చేసింది.
ముఖ్య నేతలకు మద్దతుగా నిలిస్తే టికెట్లు ఖాయమనే భావనలో ఉన్న నేతలకు పార్టీ తాజా నిర్ణయం మింగుడు పడటం లేదు. ప్రజలతో మమేకం అయిన నేతలకు..కార్యకర్తల్లో గుర్తింపు ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే ఢిల్లీలో కీలక నేతలకు పార్టీ దిశా నిర్దేశం చేసింది. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును పార్టీ అధినాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సమయంలో కీలకమైన టికెట్ల విషయంలో ఏ ఒక్కిరి సిఫార్సులకు అవకాశం లేకుండా.. క్షేత్ర స్థాయి సమాచారం, పార్టీకి పని చేసిన విధానం, ప్రజల్లో పలుకుబడి, గెలుపుకు అవకాశాలు, కార్యకర్తలతో ఉన్న సంబంధాలు..ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల ఖరారు ఉంటుందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు పార్టీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ ముఖ్య నేతల్లో హాట్ టాపిక్ గా మారింది.