అరబ్బుల నేలపై తొలి హిందూ టెంపుల్ పురుడు పోసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్మితమైన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభం కాబోతోంది. అబుదాబీలో ఆలయాన్ని ప్రారంభించేందుకు విశిష్ట అతిధిగా ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ చేరుకొని ప్రారంభించిన విషయం తెలిసిందే. మోడీకి యూఏఈ స్థానిక ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. అయితే ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకలేంటి? ఎన్ని కోట్లతో నిర్మించారో తెలుసుకుందాం.
Advertisement
యూఏఈ రాజధాని అబుదాబీలో దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా.. బాప్స్ స్వామినారాయణ్ సంస్థ ఈ గుడిని నిర్మించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ దేవాలయానికి ఏడు గోపురాలు ఉన్నాయి. అరబ్ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాలు కట్టారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతిని ఆలయ నిర్మాణానికి వాడారు. వేలాదిమంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లు కష్టపడి ఈ అద్భుత కట్టడంలో పాలుపంచుకున్నారు. గుడిలో 402 పాలరాతి స్తంభాలని అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులతో పాటు పలు శిల్పాలను చెక్కారు.
Advertisement
ఆలయ నిర్మాణానికి మొత్తం రూ. 700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. గుడి దిగువ భాగంలో గంగ, యమునా నదుల ప్రవాహాన్ని ప్రతిబింబించేలా కృత్రిమ ప్రవాహం ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పశ్చిమాసియాలో అతి పెద్ద హిందూ దేవాలయంగా నిలుస్తోంది. ఆలయంలోని రాతి ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతం లాంటి హిందూ పురాణగాథలని చెక్కారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్ధనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, పార్క్‌లు, ఫుడ్‌కోర్టులు ఉండబోతున్నాయి. భూకంపాలు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో పెద్ద సంఖ్యలో సెన్సార్లు ఏర్పాటు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటా సేకరించేలా అమర్చారు.