హైదరాబాద్ నగర సమీపంలో ఉన్నటువంటి ముచ్ఛింతల్లో చిన జీయర్ స్వామి ఏర్పాటు చేసిన సమతామూర్తి కేంద్రాన్ని జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహం ప్రాంగణం, యాగశాలను వీక్షించారు. అనంతరం ప్రవచన మండపంలో చినజీయర్ స్వామి ఆశీసులు తీసుకున్నారు. సమతామూర్తి విశేషాలను చినజీయర్ స్వామి పవన్‌కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. భిన్న మతాలు, కులాలు, సంస్కృతులకు సమతామూర్తి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Also Read : యువ క్రికెటర్ యష్ ధుల్‌ను ప్రత్యేకంగా గౌరవించిన ఐసీసీ
Advertisement
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చినజీయర్ స్వామి సంకల్పంతో 216 అడుగుల భారీ విగ్రహంతో పాటు 108 దేవాలయాలను ఏర్పాటు చేయడం భాగ్యనగరానికి సరికొత్త గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. రామానుజాచార్యులు జగద్గురువే కాకుండా అణగారిన వర్గాలను ఆలయ ప్రవేశం చేయించిన విప్లవకారుడు అని తన ప్రాయం వ్యక్తం చేశారు పవన్. ఆదివారం పవన్ కల్యాణ్‌తో పాటు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు.
Advertisement
అయితే శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించే వీఐపీలు రానున్నారు. ఫిబ్రవరి 07న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఫిబ్రవరి 08న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఫిబ్రవరి 09న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఫిబ్రవరి 10న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 11న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఫిబ్రవరి 12న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఫిబ్రవరి 13న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, వీరితో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు పాల్గొంటారు.
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో నిర్మించిన సమతామూర్తి విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ అనే ఐదు లోహాల కలయికతో పంచలోహ విగ్రహంగా తయారు చేశారు. ప్రపంచంలో కూర్చున్న స్థితిలో ఉన్న ఎత్తైన లోహ విగ్రహాల్లో ఇది ఒకటి. ఈ విగ్రహాన్ని 54 అడుగుల ఎత్తు అయిన బేస్ బిల్డింగ్ పై అమర్చారు. దీనికి భద్ర వేధిక అని నామకరణం చేశారు. వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధన కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, శ్రీరామానుజాచార్య పలు రచనలను వివరించే విద్యాగ్యాలరీ ఇక్కడ ఉంది. ఈ విగ్రహాన్ని చినజీయర్ స్వామి రూపొందించారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 02 నుంచి 14 వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Also Read : జీవితంలో నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు…కంటతడి పెట్టుకున్న విశ్వక్ సేన్..!