తెలంగాణ అధికార బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఫోబియా మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నీళ్లు..నిధులు..నియామకాల నినాదం తో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఒక్క విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతలో ఆశలు నింపిన నేతలు నేడు వారి వైపు కనీసం చూడటం లేదు. ఉద్యోగాల విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగుల ఊసే లేదు.ఈ సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ యువతలో ఆశా కిరణంగా మరింది. యవత భవితకు కాంగ్రెస్ నిర్ణయాలు భరోసాగా మారాయి.
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. కనీసం పోటీ పరీక్షలు సక్రమంగా నిర్వహించ లేని దుస్థితి. పోటీ పరీక్షలకు కేంద్రంగా ఉండే టీఎస్పీఎస్సీలోనే అక్రమాలు. దళారులు తిష్ఠ వేసారు. నిర్వహించిన పరీక్షలు రద్దు చేసారు. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని దీన స్థితి. నిరుద్యోగులు ఆందోళన చేస్తే వారి పైన కేసులు. వయసు దాటి పోతున్నా..ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఆత్మహత్యలు. కుటుంబాల్లో కన్నీరు. ఈ సమయంలో యువత కోసం కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. పార్టీ అగ్ర నేత ప్రియాంక గాంధీ తెలంగాణ యువతకు పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ పైన ఆసక్తి పెరిగింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో టెన్షన్ పెంచుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేడు యువ సంఘర్షణ సభలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని చెప్పారు ప్రియాంక గాంధీ. తాము మాట తప్పితే తమను గద్దె దించాలని సూచించారు. యూత్ డిక్లరేషన్ కు జవాబుదారీగా ఉంటామని పేర్కొన్నారు. తను సోనియాగాంధీ కుమార్తెనని నిజాయితీతో ఈ మాటలు చెబుతున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ లో భాగంగా..తెలంగాణ తొలి,మలి విడత ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పాటుగా తల్లి, తండ్రి లేదా భార్యకు రూ 25 వేల అమర వీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.
Advertisement
ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయటంతో పాటుగా జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందిస్తామని యూత్ డిక్లరేషన్ లో వెల్లడించారు. దీంతో పాటుగా పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి..సెప్టెంబర్ 17 లోగా నియామకాల పూర్తి చేస్తామని స్పష్టంగా పార్టీ ప్రకటించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ..ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ 4 వేల చొప్పున నిరుద్యోగ భ్రుతి చెల్లింపు పైన హామీ ఇచ్చారు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్పీ తరహాలో పునరుద్దరిస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు పలు నిర్ణయాలు ప్రకటించారు. ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రయివేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిన పైన హామీ ఇచ్చారు. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఈడబ్ల్యుఎస్ వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ తోపాటు పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్ లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేసి 6 నుంచి పట్టభద్రులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో 18 సంవత్సాలు పైబడిన చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందచేస్తామని ప్రియాంక గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్ లో స్పష్టం చేసారు.