సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఎస్ఎస్ఎంబీ 28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభిద్దామనుకునే లోపే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28, 2022న మరణించిన విషయం తెలిసిందే. తల్లి మరణించిందనే బాధలోంచి మహేష్ కోలుకునే లోపే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15, 2022న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.
త్రివిక్రమ్ సినిమా తరువాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు 2022లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు రాజమౌళి. మరోవైపు మహేష్ బాబు కూడా తన అందంతో, నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉన్నాడు. మహేష్ బాబు-రాజమౌలి కాంబోలో సినిమా అని ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లుక్స్ నుంచి బడ్జెట్ వరకు అన్నివిశేషాలే. సినిమాల్లో నటించినందుకు యాక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే.
కొంత మంది అలా కాకుండా వచ్చిన కలెక్షన్లలో వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఆ విధానాన్ని ఫాలో అవుతుండగా.. ఇప్పుడు మహేష్ కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కూాడా ఇదే విషయాన్ని దర్శకుడు రాజమౌళి, మూవీ ప్రొడక్షన్ హౌస్ ముందు ఉంచాడట. ఓటీటీ, వీఎఫ్ఎక్స్ సెటప్ ల ద్వారా పెద్ద హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆన్ బోర్డులోకి రావడానికి ఆసక్తి చూపిస్తుందట. ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రొడక్షన్ హౌస్ పేరును జత చేయడంతో నిర్మాతగా ఉన్నారు. అతను సినిమాకు వచ్చే లాభంలో వాటాల ప్రతిపాదికన రెమ్యునరేషన్ తీసుకోనున్నారట. ఈ సినిమాలో హాలీవుడ్ కి చెందిన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండడంతో మహేష్ కి అలాంటి డీల్ కుదరకపోవచ్చు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహేష్ ఈ విధానాన్ని అనుసరిస్తాడా లేదా అనేది వేచి చూడాలి.