చేనేత కార్మికుల కష్టాల కథలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ ఇక్కడ తెలివితో లాభాల బాట పట్టిన చేనేత కార్మికుల కథ కూడా ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం…తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ వాసులు చేనేత కార్మికులు తమ తెలివితో చేతినిండా సంపాధిస్తున్నారు. తమకు వచ్చిన…నచ్చిన పనితోనే హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే…..హన్మకొండ జిల్లాలోని చేనేత కార్మికులు మగ్గాల పై జీన్స్ నేస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం పై జీన్స్ తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ముప్పై ఏళ్లుగా కమలాపూర్ వాసులు చీరలు టవల్స్ నేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే ప్రస్తుతం యువకులంతా జీన్స్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కాటన్ ప్యాంట్ లు వేసుకునేవారు కాబట్టి చేనేత కార్మికులకు కూడా అంతో ఇంతో ఆదాయం లభించేది. కానీ ట్రెండ్ మారింది. జీన్స్ ధరించేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. దాంతో కమలాపూర్ వాసులు తాము జీన్స్ నేస్తామని తమ డీఈఓకు చెప్పడంతో ఆయన దానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. ఇక ఇప్పుడు అందులో జీన్స్ నేస్తూ నేతన్నలు ఆదాయాన్ని పొందుతున్నారు. 1950లో కమలాపూర్ చేనేత పరిశ్రమల సహకార సంగాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో మొత్తం ఐదు వందల మంది పనిచేస్తున్నారు. ఈ సంఘంలో మూడువేల చేనేత మగ్గాలు ఉన్నాయి. గతంలో వీరు టెస్కో ఆర్డర్ లపైనే ఆధారపడేవారు. కానీ జీన్స్ నేయడం ప్రారంభించిన తరవాత ఈ సంఘం వారికి ఆర్డర్స్ ఎక్కువ రావడం ప్రారంభం అయ్యింది. దాంతో వారి బిజినెస్ పెరిగి తద్వారా ఆదాయం కూడా పెరిగింది. తెలంగాణలో మొత్తం మూడు వందల యాబైకి పైగా చేనేత సంఘాలు ఉన్నాయి.
ఈ సంఘాలలో మొత్తం పదివేలకు పైగా చేనేత కార్మికులు ఉన్నారు. ఈ సంఘాలన్నీ టెస్కో పైనే ఆధారపడి ఉన్నాయి. అయితే టెస్కో కొన్ని సార్లు సరైన సమయంలో డబ్బులు చెల్లించదు. అంతే కాకుండా ఇచ్చే డబ్బులు కూడా తక్కువే. దాంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినతరవాత కమలాపూర్ కార్మికుల బాధలు తొలగిపోయాయి.