భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సూపర్ ప్రదర్శనతో మెరిసాడు. 45 పరుగులతో రెండవ రోజు క్రీజులోకి వచ్చిన జడేజా చివరి వరకు నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. టెస్ట్ కెరీర్‌లోనే రెండవ సెంచరీ సాధించిన జడేజా 228 బంతుల్లో 175 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. జడ్డూ దెబ్బకు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. జడేజా మరొక 25 పరుగులు చేస్తే డబుల్ సెంచరీ అవుతుందనుకున్న సమయంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లెర్డ్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఈ మ్యాచ్‌లో జడేజా స్పీడ్ చూస్తే మరొక 25 పరుగులు చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ జడేజాను డబుల్ సెంచరీ చేయకుండా అర్థంతరంగా ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఆ ఆలోచన రోహిత్‌ది కాదని.. టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌దని కొందరూ పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం ఎవరిదైనా మాత్రం బలైంది జడేజానే. డబుల్‌సెంచరీ కోసం ఆగి ఉంటే పరిస్థితి మరొకవిధంగా ఉండేది కాదు. కేవలం 25 పరుగుల వెనుక ద్రవిడ్, రోహిత్‌ల స్ట్రాటజీ ఏమిటో అంతుచిక్కలేదంటూ అభిమానులు వాపోయారు.
Advertisement
గతంలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ ఉన్న సమయంలో సచిన్‌ను డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు. 2004లో టీమ్ ఇండియా పాకిస్తాన్‌లో పర్యటించింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్ ద్రవిడ్ అనూహ్యంగా ఇన్నింగ్స్‌ను డిక్లెర్డ్ చేశాడు. అలా కేవలం ఆరు పరుగుల దూరంలోనే సచిన్ డబుల్ సెంచరీ చేయలేకపోయాడు. ద్రవిడ్ తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ద్రవిడ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక ఇదే మ్యాచ్‌లో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమీండియా 52 పరుగుల ఇన్నింగ్స్‌తో విజయం సాధించింది. తాజాగా జడేజా డబుల్ సెంచరీ చేయకుండా కూడా మరొకసారి ద్రవిడ్ అడ్డుపడటంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యక్షంగా రోహిత్ ఇన్నింగ్స్‌ను డిక్లెర్డ్ చేసినప్పటికీ దీని వెనుక ద్రవిడ్ ప్లాన్ ఉన్నదంటూ చాలా మంది జడేజాను సచితో పోల్చుతూ.. అప్పుడు.. ఇప్పుడూ ద్రవిడ్ విలన్ మాదిరిగా తయారు అయ్యాడని ట్వీట్ చేశారు. కొందరైతే ఏకంగా కావాలనే జడేజాను డబుల్ సెంచరీ చేయకుండా అడ్డుపడ్డారంటూ కూడా పేర్కొన్నారు.
Also Read : తెలంగాణ గవర్నర్‌తో కలిసి ఎమ్మెల్యే రోజా మహిళా దినోత్సవ వేడుకలు.. ఫొటోలు వైరల్..!