ట్విట్టర్ లో రోజు రోజుకు ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదాయ నియంత్రణ చర్యలో భాగంగా కంపెనీ అధిపతి ఎలన్ మస్క్ ఇంకా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూనే ఉన్నారు. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. వారిని తొలగించిన విషయాన్ని కొంతమంది ఉద్యోగులకు E Mail ద్వారా..మరికొందరికీ లాగిన్ యాక్సెస్ ద్వారా సమాచారం ఇచ్చారు.
Advertisement
తాజాగా తొలగించిన వారిలో ఎస్తర్ క్రాఫోర్డ్ అనే ఉన్నతోద్యోగి కూడా ఉండటం గమనార్హం. పని చేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ గతంలో ఆఫీస్ లో నేలపైనే నిద్రించి వార్తల్లో నిలిచినటువంటి ఆమెను కూడా ఎలన్ మస్క్ తొలగించారు. మస్క్ తొలగింపులు చేయడం మొదలుపెట్టిన సమయంలో ఉద్యోగులకు చాలా లక్ష్యాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. ఆ లక్ష్యాలను అందుకోని వారిని తొలగిస్తానని హెచ్చరిక చేశారు. దీంతో ప్రొడక్ట్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎస్తర్.. గడువులోపు టార్గెట్ ని అందుకోవడానికి గతంలో ఆఫీస్ లోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త నివేదికను సిద్ధం చేసేందుకు ఇలాంటి త్యాగాలు తప్పవు అని పరోక్షంగా ఎలన్ మస్క్ కి ఓ రకంగా మద్దతుగా నిలిచారు. అవేవీ పట్టించుకోకుండా మస్క్ ఇప్పుడు ఆమెను తొలగించారు.
Advertisement
నిద్రలేని రాత్రులను గడిపి టార్గెట్ ని రీచ్ అయినప్పటికీ తనను తొలగించడాన్ని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్తర్ క్రాఫోర్డ్. కష్టపడి పని చేయడం తప్పు అని తెలిసి వచ్చిందని వాపోయారు. ఎస్తర్ 2020లో ట్విట్టర్ లో చేరారు. ఆమె గతంలో స్క్వాడ్ అనే స్క్రీన్ షేరింగ్ సోషల్ మీడియా యాప్ నకు సీఈఓగా వ్యవహరించారు. దీనిని ట్విట్టర్ కొనుగోలు చేసింది. దీంతో ఎస్తర్ ఈ కంపెనీలో చేరారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్ట్ విభాగాలలో పని చేశారు. ఆమె ప్రొడక్ట్ టీమ్ కి నేతృత్వం వహించడంతో పాటు ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ భవిష్యత్ లో తీసుకురాబోయే ట్విట్టర్ పేమెంట్స్ కి తన సేవలను అందిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటివరకు ట్విట్టర్ ఎనిమిది సార్లు ఉద్యోగులను తొలగించింది. పాత యాజమాన్యంతో 7,500 మంది ఉద్యోగులు పని చేయగా.. ప్రస్తుతం 2వేలకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లీడర్ సినిమా హీరోయిన్..ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?