Home » “సినిమా వాళ్లకు బలుపెక్కువ” అన్న MLA కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు! మాములు పంచులు కావు!!

“సినిమా వాళ్లకు బలుపెక్కువ” అన్న MLA కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు! మాములు పంచులు కావు!!

by Azhar
Ad

వైసిపి MLA ప్ర‌స‌న్న కుమార్ టికెట్ల రేట్ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సినిమా వాళ్ల‌కు బ‌లుపెక్కువ అన్నారు. దీనిని హర్ట్ అయిన సినీ ద‌ర్శ‌కుడు వి.ఎన్ ఆదిత్య ఘాటుగా స్పందించారు. ఈయ‌న మ‌న‌సంతా నువ్వు, నేనున్నాను లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు తీశారు.  ఆయ‌న కౌంట‌ర్ య‌థాత‌థంగా

Advertisement

 

“సినిమా వాళ్లకు బలుపెక్కువ… ఈ మాట వినగానే ఒక్క క్షణం మనసు చివుక్కుమంది.. ఇక్కడి వాళ్ల కష్టాలు గుర్తొచ్చి.. కానీ తర్వాత స్వాభిమానంతో ఆలోచిస్తే, నిజమే కదా “బలుపు” ఎందుకుండకూడదు అనిపించింది.. ఈ మాట అన్నవాడు, వాడి జీవితంలో ఒక అయిదు వేల మంది పాత్రల్ని కలుస్తాడేమో పర్సనల్ గా..ఒక్క సినిమా వాడు మాత్రమే సినిమాకొక యాభై మంది చొప్పున యాభై ఏళ్లలో రెండు లక్షల యాభైవేల పైచిలుకు పాత్రల్ని కలిసేస్తాడు.

ఎంత అనుభవం వస్తుంది తర్వాత తరాలకి అందించడానికి..ఆ మాత్రం బలుపుండచ్చు. ఒక రాజకీయ నాయకుడు ఓటేసిన వాడిని మాగ్జిమమ్ “ఓటరు మహాశయా” అంటాడు.. సినిమా వాడు మాత్రమే ప్రేక్షకుడిని “దేవుడం”టాడు. ఒక మనిషి వాడి జీవితం మాత్రమే వాడు అనుభవిస్తాడు.. సినిమా వాడు,వాడి జీవితంతో పాటు అందరి జీవితాలూ అనుభవిస్తాడు. అందుకే అందరి పట్లా, అన్ని సమస్యల పట్లా సున్నితంగా స్పందిస్తాడు.. బలుపుండచ్చు.. తప్పులేదు.

 


ప్రజలు ఎన్నుకున్నాక, ఒక రాజకీయ నాయకుడు గెలిచి పదవిలో ఉన్నంత వరకే అతనికి మర్యాద, కొద్దిమందికి మాత్రమే మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో స్థానం.. కానీ సినిమా వాడు భూమ్మీద మనిషి మనుగడ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాడు.. సినిమా రూపంలో..రాజకీయ నాయకుడు గెలిచి, పదవిలో ఉన్నంతవరకే హీరో.. మిగిలిన జీవితమంతా జీరో.. కానీ సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే, లైఫ్ లాంగ్ అండ్ ఆఫ్టర్ లైఫ్ కూడా హీరోయే..ఏదో ఒక కళలో నిష్ణాతుడికే బలుపుండచ్చు..అంటే, అరవై నాలుగు కళల సమాహారమైన మాధ్యమం లో బతికే ఇరవై నాలుగు క్రాఫ్టుల సినిమా వాడికి ఎంతైనా బలుపుండచ్చు

ఒక రాజకీయ నాయకుడి ఎన్నికల ప్రచారానికి సినిమా వాడు సాయపడతాడు.. ఒక్క సినిమా టిక్కెట్టు తెగడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడూ, అతని ప్రచారమూ పనికి రావు.. ప్రేక్షకుడి మౌత్ టాక్ తప్ప.. మరి బలిసి కొట్టుకోడంలో తప్పేం ఉందిరా బ్లడీ ఫూల్.. ఒక సినిమా వాడు రాజకీయ నాయకుడు అవ్వగలడు.. తలకిందులుగా తపస్సు చేసినా ఒక రాజకీయ నాయకుడు పది కాలాలపాటు ప్రేక్షకుడిని అలరించే కథానాయకుడు కాలేడు.. ఒక ఎమ్మెల్యే గెలిస్తే, ఏడు మండలాల ప్రజల్లో సగం మంది ఓట్లేసిన వారికి మాత్రమే గొప్ప.. ఒక సినిమా వాడు హిట్ అయితే, తెలుగు ప్రజలెక్కడుంటే అన్ని దేశాల్లోనూ గొప్ప.. ప్రేక్షకుడిని చూసి, అభిమానుల అండ చూసి సినిమా వాడు బలిసి కొట్టుకుంటాడు. ఏ ఒక్క నాయకుడి వల్లా కాదు.. అదే ఓటర్ ని చూసి రాజకీయ నాయకుడు బలిసి కొట్టుకోగలడా.. వణికిపోతాడు.. వంగి వంగి దణ్ణాలుపెడతాడు

Advertisement

సినిమాల్లో రాణిస్తే దేవుడవుతాడు.. రాజకీయాల్లో రాణిస్తే రాజవుతాడు.. బలుపెవడికెక్కువుండాల్రా.. ఒక సినిమా వాడు అందమైన మరో ప్రపంచాన్ని ఆరునెలలకొకటి సృష్టించగలడు.. ఒక నాయకుడు ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆర్రోజులైనా ఉంచగలడా.. ప్రజలిచ్చిన “అధికారం” నీ ప్రతిభా సామర్ధ్యాలకి ప్రతీక.. అందువల్ల నీలో “అహంకారం” తలకెక్కితే.. అది నీ పతనానికి పునాది.. మర్యాదగా అన్ని రంగాలనీ కలుపుకు పోతావో.. కాదని ప్రజాగ్ని కి ఆహుతై సమిధల్లో కలిసి పోతావో .. నీ విజ్ఞత..

అందరినీ కలుపుకు పోతే అన్న అంటారు.. నోటికొచ్చినట్టు వాగితే తన్నమంటారు..బలుపు మా ఇంటి పేరు..వాపు నీ వంటి తీరు..నీ వాపుకి పదవీ కాలం పదవిలో ఉన్న అయిదేళ్లే.. సినిమా వాడి బలుపుకి పదవీ కాలం భూమి మీద తెలుగు వాడు ఉన్నంత కాలం..
గుర్తుంచుకో.. సినిమా ప్రపంచం మొత్తాన్ని నీ ఇంటికి తెచ్చి చూపిస్తుంది.. నీ జీవిత కాలంలో నూట యాభై రూపాయలకి నీ ఇంట్లో వాళ్లందరికీ ప్రపంచాన్ని చూపించగలవా.. చవట సన్నాసీ..

సినిమా వాడు తల్చుకుంటే రాజకీయ నాయకుడిని, సీ ఎమ్ ని, ఎమ్మెల్యే ని, పోలీస్ ని, దొంగని, రౌడీ ని, రాజుని, డాక్టర్ ని, రోగిని, సైకోని, చిల్లర ఏరుకునే వాణ్ని , బిచ్చగాడిని , చిన్న పిల్లల్ని. ఆడపిల్లల్ని, జంతువుల్ని, ఈగని, దోమని, ఎవ్వరినైనా హీరోగా చేసి సినిమా తీయగలడు.. ఒక రాజకీయ నాయకుడు ఇంకొకడిని హీరోగా చేయగలడా జన్మంతా తపస్సు చేసినా.. వాడి అధికారం కాపాడుకోడానికి పాకులాడడం తప్ప.. సినిమా వాడికి బలుపుంటే తప్పేంట్రా..?

భారత దేశంలో సినిమా పుట్టి వందేళ్లు అయింది.. అందులో తెలుగు సినిమా పుట్టి తొంభై ఏళ్లు ప్లస్.. (1931) భారతదేశానికి స్వతంత్రం వచ్చే డెబ్బై అయిదేళ్లు.. ( 1947 ) స్వతంత్ర భారతదేశ రాజ్యంగము, రాజకీయమూ పుట్టక ముందే సినిమా పుట్టింది.. ఎన్నో పోరాటాలని, అమరవీరుల ఆత్మకథలని, దేశ సాంస్కృతిక, సారస్వత సంపదలని ఒక మాధ్యమంలో నిక్షిప్తం చేసి ఇవాళ మీరంతా అమ్ముకుంటున్న చెట్ల పేర్లని తరతరాలకి తెలియపరుస్తోంది.. బలుపుంటే తప్పేంట్రా.. బడా చోర్..

ఇట్లు
-నలభై ఏడేళ్లుగా సినిమాలు చూస్తూ పెరిగి, ముప్పై ఏళ్లుగా సినిమా ఫుడ్ తిని తెగ “బలిసి”న సినిమా వాడు.. అలిసిపోయి ఇక్కడితో ఆపుతున్నాను.. మేటర్ అయిపోయి కాదు..”
మీ
V.N .ఆదిత్య

Visitors Are Also Reading