విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రాల్లో తాతమ్మ కలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ సినిమా ముగింపును రెండుసార్లు మార్చి రెండు సార్లు విడుదల చేయడం ఒక విశేషమైతే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కుటుంబ నియంత్రణను వ్యతిరేకించిన ఈ చిత్రానికి ఉత్తమ కథగా నంది అవార్డు రావడం మరొక విశేషం.
Advertisement
రెండేండ్ల గ్యాప్ తీసుకుని కుల గౌరవం చిత్రం తరువాత రామకృష్ణ సినీ స్టూడియో పతాకంపై తాతమ్మ కల చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు ఎన్టీఆర్. రచయిత నర్సరాజు కథా చర్చలు ప్రారంభించారు. నాలుగు తరాల నాటి పండు ముత్తయిదవ కథ ఇది. ఆ పాత్ర పోషించేది ఎవరో ముందే చెబితే ఆవిడను దృష్టిలో పెట్టుకుని డైలాగ్‌లు రాయవచ్చని రచయిత నరసరాజు చెప్పారు. భానుమతి గారే ఈ పాత్రకు యాప్ట్. ఆమెను దృష్టిలో పెట్టుకుని రాయండి. ఆమెతో నేను మాట్లాడుతాను ఎన్టీఆర్ అన్నారు.
ఆ సమయంలో భానుమతి అమ్మాయి పెళ్లి చిత్రాన్ని నిర్మించే సన్నాహల్లో ఉన్నారు. ఆ సినిమా కన్నడ రీమేక్. భార్య, భర్తలకు సంబంధించిన కథ అది. తాతమ్మ కల చిత్రంలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంది. ఎన్టీఆర్ భర్త పాత్ర పోషిస్తే బాగుంటుందని భానుమతికి అనిపించింది. కానీ రామారావు బిజీ హీరో కావడంతో కాల్షీట్లు దొరుకుతాయో లేదో అనే సందేహం వచ్చింది. అమ్మాయి పెళ్లి చిత్రానికి కూడా రచయిత నరసరాజునే. ఆమె సందేహాన్ని గమనించి ఓ సారి అడిగి చూడడంలో తప్పులేదనే సలహా ఇచ్చారు నరసరాజు. అప్పుడే తాతమ్మకల ప్రస్థావన వచ్చింది. రామారావు తాతయ్య పాత్ర పోషిస్తే.. తాతమ్మ వేశం వేస్తానని చెప్పింది భానుమతి.
అదేవిధంగా అమ్మాయి పెళ్లి సినిమాలో ఎన్టీఆర్‌ను నటించమని కోరింది. అప్పుడు ఎన్టీఆర్ అంగీకరించాడు. తాతమ్మ కల చిత్రంలో భానుమతి ముని మనువడుగా బాలకృష్ణ నటించాడు. బాలకృష్ణకు తొలి సినిమా ఇదే కావడం విశేషం. బాల్యం నుంచి బాలకృష్ణలోని నటన ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో అతనికి తగ్గ పాత్రను సృష్టించారు. తాతమ్మ కల చిత్రంలో నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉండగా.. అయితే హరికృష్ణ, బాలకృష్ణ ఆయనకు కొడుకులుగా నటించారు. కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ.. భానుమతి పాత్రతో కొన్ని డైలాగ్‌లు చెప్పించారు ఎన్టీఆర్.
Advertisement
అలాగే భూ సంస్కరణలను కూడా ఎన్టీఆర్ వ్యతిరేకించి ఈ చిత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తాతమ్మ కథ చిత్రంపై అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. ఫలితంగా ఈ చిత్రాన్ని రెండు నెలలు నిషేదించింది ప్రభుత్వం. ఆ సమయంలో ఎన్టీఆర్ వివరణ ఇస్తూ.. భూ సంస్కరణలు, కుటుంబ నియంత్రణకు నేను వ్యతిరేకిని కాను. కష్టపడి పని చేయాలని సినిమాలో చెప్పాను. దేశంలో అందరూ కష్టపడి పని చేస్తే కుటుంబ నియంత్రణ, భూసంస్కరణలు అనవసరం అని అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్.
తాతమ్మ కల చిత్రం 50 రోజులు నడిచిన తరువాత చిత్ర ప్రదర్శనను నిలిపివేసి కొన్ని మార్పులతో 1975 జనవరి 08న మరల విడుదల చేశారు. ఈ సినిమాను తొలుత బ్లాక్ అండ్ వైట్‌లో తీసినా ఆ తరువాత రెండోసారి రంగులు జోడించారు. బాలకృష్ణకు పి.సుశీల పే బ్లాక్ పాడారు. ఆయనకు ఎం. రమేష్ నేపథ్యగానం చేశారు. తొలుత తాతమ్మ భర్త సన్యాసుల్లో కలిశారని చూపించారు. రెండవ సారి మరల ఇంటికి తిరిగి వచ్చారని చూపించారు. ఎన్టీఆర్‌కు ఆశించిన ఫలితం దక్కకపోయినా ఒక సినిమా ఇలా రెండు సార్లు విడుదల కావడం విశేషంగా చెప్పుకున్నారు.
ఎన్టీఆర్, భానుమతి వంటి తారాగాణంతో కలిసి తొలిసారి బాలకృష్ణ కెమెరా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ డైరెక్టర్‌గా బాలకృష్ణకు అంతకు ముందే సన్నివేశాన్ని వివరించి ఎలా నటించాలో చెప్పారు. ఎన్టీఆర్ చెప్పింది శ్రద్దగా విన్నారు బాలకృష్ణ. అతని మనుసులో మాత్రం తండ్రి ఎన్టీఆర్ నిండు మనుసులో నటించిన తీరును మననం చేసుకుంటూ సీన్‌లో అలాగే నడుచుకుంటూ వచ్చారు. అది చూసి ఎన్టీఆర్ ఆగ్రహంతో అరేయ్ నేను చెప్పిందేమిటి..? నువ్వు చేసిందేమిటి..? ఏమిటి ఆ నడక రౌడి మాదిరిగా అని గర్జించారు. బాలయ్యబాబు హడలిపోయారు. అయినా తేరుకుని మరొక టేకులో తండ్రి చెప్పినట్టు నటించారు. భానుమతి రామారావు గారు పిల్లాడు చక్కగా నటించాడు. అనవసరంగా భయపెట్టకండి అని చెప్పింది. మీ పేరు నిలబెడతాడు అని దీవించారు. ఆమె చెప్పినట్టుగానే బాలయ్య నేటికి సినిమా రంగంలో రాణిస్తూనే ఉన్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ ని ప్రకాష్ రాజ్ మోసం చేసాడని పవన్ ఆ సినిమా నుంచి తీసేశాడట !