Home » అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి పేరు మార్పు.. ఇక నుంచి ఆ పేరుతోనే..!

అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి పేరు మార్పు.. ఇక నుంచి ఆ పేరుతోనే..!

by Anji

అయోధ్యలో రామాలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ వేడుకను దేశ, విదేశాల్లోనూ భక్తులందరూ టీవీ, సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడ పూజలు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరుతో పిలవనున్నారు.

 

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్‌ లల్లా విగ్రహం ఐదేళ్ల బాలుడిలా నిలబడిన భంగిమలో ఉన్న రాముడిని సూచిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఆ విగ్రాహాన్ని ‘‘బాలక్ రామ్’’ అని పిలుస్తారు. ముడుపుల కార్యక్రమంలో పాల్గొన్న పూజారి అరుణ్ దీక్షిత్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “జనవరి 22 న ప్రతిష్టించిన శ్రీరాముని విగ్రహానికి ‘బాలక్ రామ్’ అని పేరు పెట్టారు. రాముడి విగ్రహానికి ‘బాలక్ రామ్’ అని పేరు పెట్టడానికి కారణం ఆయన ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న చిన్నపిల్లలా కనిపించడమే.’’ అని స్పష్టం చేశారు.

 

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని మూడు బిలియన్ ఏళ్ల నాటి రాతిపై చెక్కారు. ఈ శిల్పానికి ఉపయోగించిన నీలిరంగు కృష్ణ శిలే (నలుపు రంగు) ను మైసూరులోని హెచ్.డి.కోట తాలూకా, జయపుర హోబ్లీలోని గుజ్జెగౌడనపుర నుండి వెలికితీశారు. మృదువైన ఉపరితల ఆకృతి కారణంగా సాధారణంగా సోప్ స్టోన్ అని దానిని పిలుస్తారు.

Visitors Are Also Reading