Home » అకాడ‌మీ అవార్డ్ పొందిన ‘వ‌ల్లంకితాళం’లో ప్ర‌కృతి ప‌ర‌వ‌శ‌త్వం.

అకాడ‌మీ అవార్డ్ పొందిన ‘వ‌ల్లంకితాళం’లో ప్ర‌కృతి ప‌ర‌వ‌శ‌త్వం.

by Sravan Sunku
Published: Last Updated on

వ్యాస‌క‌ర్త‌:

అజ‌హారుద్దీన్
ప‌రిశోధ‌క విద్యార్థి

గోర‌టి వెంక‌న్న ర‌చించిన వ‌ల్లంకితాళం అనే క‌వితాసంపుటికి 2021లో కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు ల‌భించింది. న‌ల్ల‌మ‌ల్ల అడ‌విలో తిరుగుతూ తాను చూసిన దృశ్యాల‌ను, త‌న జీవితానుభ‌వాల‌ను క‌ల‌గ‌లిపి గోర‌టి వెంక‌న్న వల్లంకితాళం అనే క‌వితాసంపుటిని వెలువ‌రించాడు. వ‌ల్లంకిపిట్ట కంఠ‌ధ్వ‌ని తాళం కొట్టిన‌ట్లుంటుంది కాబ‌ట్టి త‌న క‌వితాసంపుటికి వ‌ల్లంకితాళం అనే పేరును పెట్టాడు. ఈ క‌వితా సంపుటిలో అడ‌వి అందాన్ని, అడ‌వి ధ‌ర్మాన్ని, అడ‌వి త‌త్త్వాన్ని వి

వ‌రించాడు. క‌వి సునిశిత ప‌రిశీలన కార‌ణంగా అడ‌వికి మాత్ర‌మే ప‌రిమిత‌మైనవాటికి కావ్య‌గౌర‌వం ద‌క్కింది. కోకిల పాట‌ల‌కు అల‌వాటుప‌డిన ప్ర‌కృతి ప్రేమికుల‌కు వ‌ల్లంకి పిట్ట సంగీతాన్ని ప‌రిచ‌యం చేశాడు. మాధీ ఫ‌లాల రుచులు తెలిసిన నాలుక‌ల‌కు కొత్త‌గా ఇరికి, బులుసు పండ్ల రుచిని చూపించాడు.

క‌లిసిమెలిసి తిరిగె క‌న‌తిదుప్పుల వ‌రుస
వైర‌మ‌న్న‌ది లేని ఎలుగుబంటి జింక…………… అంటూ అడ‌వి జంతువుల మ‌ధ్య స్నేహాన్ని ప‌రిచ‌యం చేస్తూనే…

పాము ప‌డగ మెడ‌కు ప‌టుగార ముంగిస‌
పులినె కుమ్మె ద‌మ్ము కొండ‌గొర్రె కొమ్ము! అని అడ‌విలోని పోరాటాన్ని చిత్రీక‌రించాడు.

అడ‌విలోని స్నేహాన్ని, పోరాటాన్ని తెలుపుతూ వాస్త‌వాన్ని గుర్తుచేశాడు. చుట్టూ ఉండే స‌మ‌స్య‌ల‌ను చూపుతూనే ప‌రిష్కారం సైతం అక్క‌డే ఉంద‌న్న‌ట్టు గుర్తుచేస్తూ అడ‌విలోని స‌న్నివేశాల‌ను స‌మాజానికి లంకె పెడుతూ జీవిత పాఠాలు చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు.

అడ‌వులే ఆవాసంగా బ్ర‌తికే చెంచుల మ‌న‌స్త‌త్వాన్ని వారి ప్రేమ‌ను క‌ళాత్మ‌కంగా తెలిపాడు.సంతోషాల‌కు సంప‌ద‌, ఐశ్వ‌ర్యాల‌తో ప‌నిలేద‌నే వాస్త‌వాన్ని తెలియ‌జేస్తూ……

వెదురు త‌డ‌క‌ల‌తోని ఎంతంద‌మీ ఇండ్లు
ఆవుపేడ‌తోని అలికిన వాకిల్లు
చెంచులా న‌వ్వులే చెట్ల‌కు పువ్వులు…. అంటాడు!

చిరుగాలికి వెదురుచెట్లు చేస్తున్న‌ గానాల‌ను, మ‌బ్బుల‌ను చూసి నాట్యం చేస్తున్న నెమ‌ళ్ళ‌ను, చెట్ల‌మీద ఉన్న వ‌ల్లంకి పిట్ట‌ల తాళాల‌తో మ‌న‌ల్ని మ‌మేకం చేస్తూ ఓ ఆహ్ల‌ద‌క‌ర వాతావార‌ణాన్ని క్రియేట్ చేసి అంత‌లోనే ఓ బెడ‌ల గువ్వ / ఆకాల‌మేమాయే మీ మేళ‌మేమాయె అని… అడ‌వుల నుండి క‌నుమ‌రుగైన అనేక ప‌క్షుల జ్ఞాపకాల‌ను ఆర్తితో నెమ‌రేసుకున్నాడు. క‌మ్యూనికేషన్ వ్య‌వ‌స్థ మ‌నుషుల‌ను ద‌గ్గ‌ర‌కు చేస్తూ ప‌క్షుల‌ ఉనికిని ఎలా ప్ర‌శ్నార్థ‌కంగా మార్చిందో అర్థ‌మ‌య్యేరీతిలో తెలియ‌జేశాడు.

కొబ్బ‌రి ఆకుల మ‌ధ్య‌లోంచి కురుస్తున్న వెన్నెల‌ను అనేక రూపాలంకారాల‌తో క‌వి వ‌ర్ణించిన తీరును చూస్తే ‘వెంక‌న్న‌ను వెన్నెల‌ను వేరేచేయ‌లేమేమో’! అనిపిస్తుంది. సాధార‌ణంగా క‌వులంతా వెన్నెల‌ను ఉప‌మానంగా తీసుకొని పోలిక‌లు చేస్తుంటారు. వెంక‌న్న మాత్రం వెన్నెల‌ను ఉప‌మేయంగా మార్చాడు. వెన్నెల‌ను బుద్దుని మునివేలి ప‌ద్మంలాగా, జైన‌తీర్థంక‌రుల జ‌ప‌మాల లాగా, వేమ‌న అచ‌లసిద్ధాంతంలాగా, వీర‌బ్ర‌హ్మం వెండిబెత్తంలాగా పోలుస్తూ……… స‌మాజాన్ని చైత‌న్యంవైపు న‌డిపించిన మ‌హానీయులు ఆకాంక్షించిన‌ జ్ఞానాబోధ‌ను చేశాడు.

కురుస్తున్న వ‌ర్షంతో త‌న్మ‌య‌త్వం చెంది చిన్నపిల్లాడిలా మారిపోయిన గోర‌టి వెంక‌న్న‌, మ‌న‌ల్ని కూడా వేలుప‌ట్టుకొని మ‌రీ బాల్యంలోకి తీసుకెళ‌తాడు. వాగులోన సేపోలే / లేగ‌దూడ గంతోలే మ‌న‌తో గంతులువేయిస్తూ దాగుడుమూతలు, తొక్కుడు బిల్ల‌, సిర్ర‌గోనేలాంటి చిన్న‌నాటి ఆట‌ల‌ను గుర్తుచేస్తాడు. వ‌ర్షాన్ని ఆస్వాదించిన వెంక‌న్న హేమంతరుతువును కూడా అంతే సంతోషంగా స్వాగ‌తిస్తాడు.
పండి ప‌గిలిన కొండ గుత్తులా/ ప‌త్తులా ఈ మంచు పొత్తులు అంటూ మంచును ప‌త్తితో పోల్చుతూ హేమంత‌పు చ‌లిని ప‌రిచ‌యం చేస్తాడు. క‌లువ కౌగిట క‌రిగి వెన్నెల జ‌ల‌క‌మాడిన కొంగ రెక్క‌లు అంటూ ప్ర‌కృతి దృశ్యాల‌ను అనుభూతి చెందిస్తు, రాగి క‌ల‌శ‌ముతో న‌డుచుకుంటూ వ‌స్తున్న రామ‌దాసుల ప్ర‌స్తావ‌న‌తో సంక్రాంతి పండుగ‌ను ఆవిష్క‌రిస్తాడు.

బ‌తుక‌మ్మ పండుగ‌పై వ‌చ్చిన అనేక క‌విత‌ల‌కు, ప్ర‌కృతి కేంద్రంగా మాన‌వ జీవ‌న ప్ర‌మాణాల‌ను నిర్ధేశించే వెంక‌న్న క‌విత్వానికి చాలా తేడా ఉంటుంది. ప‌ర్యావ‌ర‌ణ స్పృహ ఎక్క‌వ‌గా ఉన్న గోర‌టి వెంక‌న్న బ‌తుక‌మ్మ‌నుద్దేశిస్తూ……

బంగారు తంగెళ్ళు
వెండి గునుగులు
రాగి గోరింట‌లు
కెంపు గులాబీలు
ప‌సుపు గుమ్మ‌డులు ప‌ర‌వ‌శించిపోతాయన్నాడు. బ‌తుక‌మ్మ పండుగ‌తో ముడిప‌డివున్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని క‌ళ్ళ‌కుక‌ట్టి… రంగు రంగు బ‌తుక‌మ్మ‌ల కార‌ణంగా న‌క్ష‌త్రాల‌కే మ‌రింత వెలుగువ‌చ్చింద‌న్నాడు. బ‌తుక‌మ్మ పండుగ‌తో పెన‌వేసుకున్న అన్న‌చెల్లెళ్ళ అనుబంధాన్ని, ఆత్మీయ‌త‌ను స‌జీవంగా చిత్రీక‌రించాడు.

క‌లిసిన హృద‌యాలు ఏకం కావ‌డానికి ప్ర‌కృతి సైతం స‌హ‌క‌రిస్తుంద‌ని చెబుతూ కాసింత ఘాటైన శృంగార రసాన్ని త‌న ‘పుప్పొడి మైకం’ అనే క‌విత‌లో చిల‌క‌రించాడు గోర‌టి వెంక‌న్న‌. ఆ శృంగారం కూడా ఒక స్క్రీన్ ప్లే లాగా సాగిపోవ‌డం క‌వితా విశేషం!

నా సెంత నీవుంటె
ఆక‌లేడ‌యితాది
త‌నువంత నీవె వుంటే
జుంటితేనెందుకంట‌
—————————
————————-
మ‌న‌యిద్ద‌ర మ‌ళ్ళుకుంటెరొ
ఎన్నెల‌కు తావేడుంట‌దిరొ! ఇలా ఏక‌మైన జంట‌కు ప్ర‌కృతి అండ‌గా ఉన్న వైనాన్ని చూపుతూ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను ఆవిష్క‌రించాడు. ప్రాచీన ప‌ద‌బంధాల జోలికి పోకుండా, దీర్ఘ‌స‌మాసాల ఊసెత్త‌కుండా పూత‌రేకులు, పుప్పొడులు, పాల‌కంకులు అంటూ దేశీయ ప‌దాల‌తో న‌న్నెచోడుడి ప్రేర‌ణ‌తో త‌న వ‌ల్లంకి తాళం క‌వితా సంపుటిలో ప్ర‌కృతికి ప‌ట్టం క‌ట్టాడు గోర‌టి వెంక‌న్న‌.

 

Visitors Are Also Reading