క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు.. కానీ, ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఇది ఓ సినిమాలోని డైలాగే అయినా.. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ ప్రయాణానికి కరెక్ట్ గా సరిపోతుంది. బీఆర్ఎస్ లో ఉన్నా.. తర్వాత బీజేపీలో చేరినా.. ఆయన ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయితే.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యం చేరుకుంటారని అనేక సంఘటనలు రుజువు చేశాయి.
Advertisement
సమైక్య పాలకుల కబంధ హస్తాల మధ్య నలిగిపోతున్న తెలంగాణ విముక్తి కోసం సాగిన ఉద్యమంలో ఈటల రాజేందర్ ది కీలక పాత్ర. పేరుకు బీఆర్ఎస్ కు కేసీఆర్ అధ్యక్షుడు అయినా.. ఆ స్థాయిలో ఈటల రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. కానీ, అనూహ్యంగా ఆయన్ను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపడం.. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.. వెంటనే ఉప ఎన్నిక రావడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. ఉప ఎన్నికలో ఆయన్ను ఓడించాలన్న కేసీఆర్ వ్యూహాలేవీ ఫలించలేదు.
అధికార బలాన్ని ఉపయోగించి.. కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్. 60 ఏళ్ల పాలనలో చూడని పనులు ఆరు నెలల్లో చూశామని అక్కడి జనం మీడియాకు చెప్పిన సందర్భాలున్నాయి. కొత్తగా వచ్చే ఎమ్మెల్యే హుజూరాబాద్ లో చేయడానికి ఏమీ లేదనుకునే పరిస్థితి కనిపించింది. కానీ, ఈటల దెబ్బకు అధికార బీఆర్ఎస్ కు కళ్లు బైర్లు కమ్మిన పరిస్థితి. మొదట్లో మంత్రి కమలాకర్ అక్కడి వ్యవహారాలు చూడగా, చివరి దశలో హరీశ్ రావు ఎంట్రీ ఇచ్చారు. ఎవరు ఏం చేసినా మెజార్టీ లెక్కలు మారాయి గానీ, ఫలితం మారలేదు. జనం ఈటలకే పట్టం కట్టారు.
Advertisement
బీఆర్ఎస్ కు చెందిన బడా లీడర్ల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా అందరూ నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. హుజూరాబాద్ లో రాత్రికి రాత్రి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఊళ్లను దత్తత తీసుకుంటామని హామీలు ఇచ్చారు. దళితబంధు వంటి అత్యంత భారీ పథకాలు ప్రకటించారు. గతంలో ఈటలపై పోటీ చేసి ఓడిపోయిన వారందర్నీ పార్టీలో చేర్చుకున్నారు. అయినా, ఫలితం ఓట్ల రూపంలో కనిపించలేదు. ప్రజలు రాజేందర్ వైపే నిలబడ్డారు. తమ నాయకుడ్నే గెలిపించుకున్నారు.
హుజూరాబాద్ ప్రజల్లో మమేకం అవ్వడమే ఈటల గెలుపునకు మార్గం సుగమం చేసింది. ఈ విజయం తెలంగాణ రాజకీయ పుస్తకంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ప్రత్యేక పేజీలు ఉండేలా చేసింది. రాజేందర్ రాజకీయ చతురతకు అద్దం పట్టింది. ఇటు బీజేపీలో చేరిన త్వరిత కాలంలోనే పార్టీ నేతలకు, కార్యకర్తలకు బాగా దగ్గరయ్యారు రాజేందర్. అధిష్టానం సైతం ఈయనపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. అందుకే చేరికల కమిటీకి కన్వీనర్ ని చేసింది. ఇప్పుడు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ తో సరిసమానంగా ఉద్యమ సమయంలో పోరాటం సాగించిన ఈటల.. ఇప్పుడు బీజేపీలో ఉండి ఆయనతో ఢీ కొడుతున్నారు. రాజేందర్ అనుకున్న లక్ష్యాలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు.