అబ్బాయిలు సాధించలేనిది అమ్మాయిలు సాధించారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఆవిర్భవించింది. ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. ఇది బెంగళూరుకు తొలి WPL టైటిల్ కావడం విశేషం.
Advertisement
WPL గత ఏడాదే స్టార్ట్ అయింది. 2023లో ముంబై విజేతగా నిలవగా.. బెంగళూరు లాస్ట్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఈ ఏడాది మాత్రం బెంగళూరు సత్తా చాటి.. ఏకంగా ట్రోపీని ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ (44, 27 బంతుల్లో; 2X4, 3X6), కెప్టెన్ మెగ్ లానింగ్(23, 23 బంతుల్లో; 3X4) అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. 7.1 ఓవర్లలో 64 పరుగులు చేసింది. మోలీనెక్స్ బౌలింగ్‌లో షెఫాలీ వర్మ అవుట్ అయ్యింది. ఆ తర్వాత అదే ఓవర్లో ఇంకో రెండు వికెట్లు తీసుకుని ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చింది. ఆ తరువాత ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిల లాడారు. మొత్తం ఏడుగురు ఢిల్లీ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది.
Advertisement
ఆర్సీబీ బౌలర్లలో మోలీనెక్స్ 3, శ్రేయాంక పాటిల్ 4, ఆశా శోభనా 2 వికెట్లు తీసుకున్నారు. ఛేదన ప్రారంభించిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు కెప్టెన్ స్మృతి మంధానా(31, 39 బంతుల్లో), సోఫీ డెవీన్(32 ; 27 బంతుల్లో 5X4, 1X6) 8.1 ఓవర్లలో 49 పరుగులు చేశారు. ఆ తర్వాత ఎలీస్ పెర్రీ, రీచా ఘోష్ లాంఛనాలు పూర్తి చేశారు. ఎలీస్ పెర్రీ(35*, 37 బంతుల్లో, 4X4) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించింది.