ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత్ మరొక పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆక్లాండ్, ఈడెన్ పార్కు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన మిథాలీ సేన ఆదిలోనే తడబడింది. స్మృతి మంధాన (10) షఫాలీవర్మ (12) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఆ తరువాత బరిలోకి దిగిన యస్తికా భాటియా (59), మిథాలీ రాజ్ (68) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివరిలో హర్మన్ ప్రీత్ కౌర్ (57), పూజా వస్త్రకార్ మెరుపులతో భారత్.. 277 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ ముందుంచింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టింది. అలానా కింగ్ రెండు వికెట్లు సాధించింది.
తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ సేనకు ఓపెనర్లు రాచెల్ హేనెస్ (43) అలిస్సా హీలీ(72) శుభారంభాన్ని ఇచ్చారు. మెగ్ లానింగ్ (97) ఎల్లిస్ పెర్రీ (28) బేత్ మూనీ (30) సైతం రాణించగా.. ఆసిస్ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.