ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. ముందుగా కర్ణాటకలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినందుకు నిర్మాత వెంకట్‌కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా ఈరోజు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ఈ చల్లని సాయంత్రం ఆయన ఓ వర్షపు చినుకుల రూపంలో, చల్లని గాలి రూపంలో ఆయన మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. పునీత్ రాజ్‌కుమార్ లేరని తానెప్పుడూ ఏడవలేదని.. ఏడవను కూడా అని స్పష్టం చేశాడు. ఎందుకంటే ఆయన ఓ సెలబ్రేషన్ అని.. జేమ్స్ రూపంలో సెలబ్రేషన్ కూడా అందించారని.. అందుకే ఆయన మన మధ్యలో లేరని ఎవరూ బాధపడొద్దని ఎన్టీఆర్ తెలిపాడు.
Advertisement
Advertisement
ఇక RRR సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ మూవీ కేవలం సినిమా కాదని.. తమ ముగ్గురి మధ్య ఉన్న బంధమని అభివర్ణించాడు. RRR టైటిల్‌ను దేవుడే నిర్ణయించి ఉంటాడని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇది కేవలం చిత్రం కాదని.. తన సినిమాల ద్వారా భారతదేశం యూనిటీ చాటాలని తాపత్రయపడుతున్న ఓ గొప్ప దర్శకుడి కల అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. రాబోయే తరాలకు నిదర్శనంగా నిలిచిపోయే ఈ సినిమా RRR అని తెలిపాడు. జక్కన్న కట్టబోయే రామసేతు లాంటి నిర్మాణంలో ఉడత లాంటి తనకు ఓ పాత్ర ఇచ్చినందుకు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు.