దివంగత నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్రపరిశ్రమకు రెండు కండ్ల లాంటి వాళ్లు. వీరిద్దరూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి వారి జనరేషన్ లో స్టార్ హీరోలుగా రాణించారు. అంతే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలించడంతో పాటూ చిత్ర పరిశ్రమ అభివృద్దికి సైతం ఎంతగానో కృషి చేశారు. వీరిద్దరి మధ్య సినిమాల పరంగా చూసినట్లయితే అప్పట్లో తీవ్రమైన పోటీ ఉండేది.
Advertisement
ఆ పోటీ వల్లే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి ఏకంగా పద్నాలుగు సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఆయా సినిమాల్లో పాత్రలు తప్ప హీరోలు కనిపించకపోవడం వారి గొప్పతనం. వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు కలిసి నటించడంతో వారి వారసులైన బాలకృష్ణ, నాగార్జున కూడా కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు.
Advertisement
అక్కినేని నాగేశ్వరరావును బాలయ్య ఆప్యాయంగా బాబాయ్ అని పిలుచుకునేవారు. అక్కినేని హీరోగా నటించిన భార్యా భర్తల బంధం సినిమాలో బాలయ్య నటించారు. అంతే కాకుండా నందమూరి హీరో హరికృష్ణతో కలిసి నాగార్జున సీతారామరాజు సినిమాలో నటించారు. అయితే అప్పట్లో బాలయ్య, నాగార్జున కాంబోలో కూడా ఓ సినిమా అనుకున్నారు. ఇక అప్పట్లో కొందరు నిర్మాతలు వీరిద్దరి కాంబినేషన్ లో గుండమ్మకథ సినిమాను చేస్తే బాగుంటుందని భావించారు కానీ కుదరలేదు. మరోవైపు బాలయ్యతో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నాగార్జున…నాగ్ తో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని బాలయ్య చెప్పారు.
ఇదిలా ఉంటే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను 2011లో వీరిద్దరితో కలిసి చేయాలనుకున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. నాగార్జున, బాలయ్యలను కలిసి కథ చెప్పగా వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ దర్శకుడి ఎంపికలో ఆలస్యం జరిగింది. దాంతో క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా గురించి మర్చిపోవాలని బెల్లంకొండకు బాలయ్య సలహా ఇచ్చారు. అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.