తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె మృతిపై తీవ్ర సంతాపం తెలియజేశారు.
Advertisement
రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యమని కేసీఆర్ కొనియాడారు. జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవిన గమనం.. గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు అని సీఎం కేసీఆర్ ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో మరణించారు అన్న వార్త తీవ్రంగా బాధించింది. చివరి వరకు నమ్మిన సిద్దాంతం కోసం పని చేసిన వ్యక్తి ఆమె బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడారు. ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
Advertisement
మల్లు స్వరాజ్యం గొప్పనేత అని, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం ఆమె మరణం తెలంగాణకు తీరని లోటనీ, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు, తెలంగాణ రాష్ట్ర సీపీఐ(ఎం) కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్ సంతాపం తెలిపారు.