మొగులయ్య 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెరనే బతుకుదెరువుగా మలుచుకున్న కళాకారుడు మొగులయ్యకు పద్మ శ్రీ అవార్డు వరించింది. దేశంలోనే నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అందుకోబోతున్న ఆయన జీవితం పూల పాన్పు కాదు..ముళ్లదారి. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. జీవితంలో ఆయనకు ఎదురైన కష్టాలను, ఒడిదుడుకులను పంచుకున్నారు.
Advertisement
నేను చాలా పేదవాడిని. నా వద్ద వెయ్యి రూపాయలు లేక నా భార్య చనిపోయింది. ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి నేను ఆఫీస్‌ల చుట్టూ తిరిగితే.. ఆమె బస్టాండ్ల డబ్బులు అడుక్కుంటూ.. సరిగ్గా తిండి లేక చివరికి చనిపోయింది. ఆమె చనిపోయాక శవాన్ని మా సొంత ఊరు అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామానికి తీసుకెళ్లడానికి రూపాయి గతి లేదు. విషయం తెలుసుకుని కేవీ రమణాచారి 10వేల రూపాయలు ఇస్తే.. అప్పుడు బండి కిరాయి కట్టుకుని ఇంటికి తీసుకెళ్లాను. మా భార్య మూడేండ్ల కిందట సరిగ్గా తిండి లేక చనిపోయింది. నాకు తొమ్మిది మంది పిల్లలు. మా కొడుకు గుండెలో నీరు వచ్చింది. హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. కానీ రూ.500 లేక అతడు చనిపోయాడు.
Advertisement
నాకు ఇల్లు లేదు. ఆధారం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి సాయం చేసేవారు. ఈ కళను బతికించాలన్నదే నా కోరిక అని మొగులయ్య పేర్కొన్నాడు. భీమ్లా నాయక్ పాటతో దర్శనం మొగులయ్య గొప్పదనం, కిన్నెర వాయిద్య పరికరం గురించి చాలా మందికి తెలిసింది. అప్పటి నుంచి పెద్ద పెద్దవాళ్లు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇక ఈ కళ బతుకుతుందనే నమ్మకం కూడా కలిగిందని స్పష్టం చేశారు. అంతరించిపోతున్న కళను ఇంకా బతికించాలనే మొగులయ్య ఆశయానికి తగ్గ ఫలితం దక్కింది. ఆయన సేవలను కేంద్రం గుర్తించింది. అంతరించి పోతున్న కిన్నెర కళను ఈ తరానికి పరిచయం చేసిన మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.