కేంద్రహోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సంధర్బంగా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అమిత్ షాతో భేటీ అవ్వడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా వీరిద్దరి భేటీని రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ ఏర్పాటు చేసినట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది.
విజయేంద్రప్రసాద్ ఇటీవల బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. కాగా ఆయనే అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీకి మధ్యవర్తి అయ్యారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన బాగుందని అందువల్లే అమిత్ షా ఆయనను అభినందించడానికి కలిసారని వార్తలు వినిపించాయి. కానీ అసలు కారణం అది కాదని భేటీ వెనక రాజకీయాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఎన్టీఆర్ తన తాత ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేయడం లేదు. పార్టీకి చాలా దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు.కానీ కొంతమంది తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు అందుకోవాలని ఆయన వస్తేనే తెలుగుదేశంకు మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బీజేపీ అభ్యర్థి అంటూ ప్రచారం జరగటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి ఎన్టీఆర్ అమిత్ షాల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా ఎన్టీఆర్ ల భేటీ రాబోయే రోజుల్లో సంచలనం గా మారుతుందని వ్యాఖ్యానించారు. అధికారికంగా అమిత్ షా ఎన్టీఆర్ రాజకీయంగా మీడియా ముందు మాట్లాడలేదని చెప్పారు. కానీ ఎన్టీఆర్ రాజకీయంగా యంగ్ డైనమిక్ లీడర్ అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయకుటుంబం నుండి వచ్చిన వ్యక్తి జాతీయనాయకుడిని కలిసినప్పుడు రాజకీయ కోణంలో చూడవచ్చని చెప్పారు. పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ తమకు ఇద్దరూ సమానమని అన్నారు.