ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాజకీయ యాత్రలకు మళ్లీ రెడీ అవుతున్నారు పవన్ కల్యాణ్. మూడు దశల్లో ఎన్నికల కార్యాచరణకు ఆయన సిద్ధం అవుతున్నారు. మొదటి దశలో పొత్తుకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తారు. రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారు. ఇక మూడో దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంఖారావం పూరిస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఏపీలో రాబోయే ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నారు.
Advertisement
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధం అవుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు చేపట్టనున్నారు పవన్. ఈ ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించబోతున్నారు. రెండు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో కలిసి వెళ్ళేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా వివాదాలు, విభేదాలు తెర పైకి వస్తూ ఉండడంతో…ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా పవన్ తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్ళేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
Advertisement
అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో పవన్ పర్యటన ఉంటుంది. రెండో దశ పర్యటనను పవన్ కల్యాణ్ ఇదే నెలలో చేపట్టనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు.. పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కల్యాణ్ పర్యటన ఉండబోతోంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్ళే అంశం, పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు.