భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది భారత్. జట్టులో ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అజేయంగా 179 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలం చెందారు.
Advertisement
ముఖ్యంగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, అందరూ శుభారంభం చేసినా అనవరసరంగా వికెట్లు సమర్పించారు. ఏ బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేదు. టీమిండియా 14 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. శుభ్మన్ గిల్ 34 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేసి నిరాశపర్చాడు. అరంగేట్ర ఆటగాడు రజత్ పాటిదార్ (32) ఆకట్టుకున్నా ఒక చక్కటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అక్షర్ పటేల్ 27 పరుగులు, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 17 పరుగుల చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
Advertisement
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ తలా ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్ (179)కు తోడుగా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో ఉన్నాడు. రెండో రోజు వీరిద్దరూ ఎంత సేపు బ్యాటింగ్ చేయనున్నారనే దానిపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాగా రెండో రోజు డబుల్ సెంచరీ సాధిస్తానని యశస్వి జైస్వాల్ ధీమాగా చెబుతున్నాడు. 172 పరుగులు చేసిన అతను ఈ మ్యాచ్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు (171)ను అధిగమించాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానులు మరుసటి రోజు యశస్వి నుండి డబుల్ సెంచరీని ఆశిస్తున్నారు.