సాధారణంగా ఒక సబ్జెక్ట్ లో హీరోయిన్ చాలా వీక్ గా ఉంటుంది. ఇక ఈ విషయం తెలిసిన హీరో అమ్మాయి వేషం వేసుకొని హీరోయిన్ స్థానంలో పరీక్ష రాసేందుకు వెళ్తాడు. ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయ్యేలా చూస్తాడు. ఇలాంటి సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అచ్చం ఇలాంటి సంఘటననే పంజాబ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో జరిగింది. అయితే.. సినిమాల్లోలాగా నిజ జీవితంలో జరగదు కదా.. అతడి ప్లాన్ బెడిసి కొట్టింది. దీంతో అతడు జైలు పాలు అయ్యాడు.
Advertisement
జనవరి 7 ఆదివారం రోజున మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ పరీక్షను నిర్వహించారు. బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష కోసం పరమ్‌జిత్ కౌర్ అనే యువతి దరఖాస్తు చేసుకుంది. ఆమెకు కోట్కపురాలోని డీఏవీ పాఠశాలలో ఎగ్జామ్ సెంటర్ పడింది. ఆమె స్థానంలో ప్రియుడు ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ పరీక్ష రాయాలని నిర్ణయం తీసుకున్నాడు. పరీక్ష రోజున అతడు.. నుదుట తిలకం, పెదాలకు లిప్‌స్టిక్, ఎరుపు రంగు గాజులతో పాటు లేడీస్ డ్రెస్ వేసుకున్నాడు. అచ్చం అమ్మాయి మాదిరిగా రెడీ అయి ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు.
Advertisement
ఇక అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నకిలీ గుర్తింపు కార్డు కూడా తీసుకువెళ్లడంతో అధికారులు తొలుత అతడిని గుర్తించలేకపోయారు. అభ్యర్థుల దగ్గర ఇన్విజిలేటర్ బయోమెట్రిక్ తీసుకుంటూ అంగ్రేజ్ సింగ్ వద్దకు వచ్చాడు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో అతడివి మ్యాచ్ కాలేదు. దీంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలిసి పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో పాటు అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అతడిని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.