ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం.. మరోవైపు జగన్ సర్కార్‌ను గద్దె దించాలని టీడీపీ-జనసేన పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ ‘సిద్ధం’ అనే పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. బహిరంగ సభల్లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. విపక్ష పార్టీల నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు.
Advertisement
ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సూచనలు చేశారు. 45 రోజులు కష్టపడితే మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారైనట్లేనని.. కాస్త స్వల్ప మార్పులు ఉంటే ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మార్చాల్సినవి ఇప్పటికే 99 శాతం మార్చేశామని అన్నారు. ఇక పెద్దగా మార్పులు ఏమి ఉండవని స్పష్టం చేశారు.
Advertisement
పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలని.. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని కూడా ఐదారుసార్లు కలవాలని అన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా పార్టీ క్యాడర్ యాక్టివ్‌గా ఉండాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గత కొన్నిరోజులుగా వైసీపీ.. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జిలను నియమిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంఛార్జి బాధ్యతలు చేపట్టినవారే దాదాపుగా.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సీఎం జగన్ తాజాగా చేసిన ప్రకటనతో ఓ క్లారిటీ వచ్చేసింది.
Also Read : సింగర్ తల్లిదండ్రులు షాకింగ్ నిర్ణయం.. 58 ఏళ్ల వయస్సులో..!