కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీల కోసం స్వీకరించిన అభయ హస్తం దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఆరు గ్యారెంటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోటికి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల చివరి లోపు డేటా ఎంట్రీ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టొద్దని అధికారులకు సూచించారు. అవసరమైన వివరాల కోసం దరఖాస్తుదారునికి ఫోన్ చేసి సరైన సమాచారం కనుక్కుని డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసిన తరువాతే వాటిని ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి నెలాఖరు వరకు డేటా ఎంట్రీ పూర్తిచేసి అర్హులైన వారందరికీ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అభయ హస్తం దరఖాస్తుల తదుపరి కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
Advertisement
Advertisement
ఈ కమిటీ అర్హులను ఎంపికచేసి అభయహస్తం పథకాలను అందజేయనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఇందులో ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వచ్చిన దరఖాస్తుల్లో ఏయే పథకానికి ఎవరెవరు అర్హులు అనేది తేల్చనుంది. మరోవైపు ఇప్పటికీ చాలామంది ప్రజలు అభయాహస్తం ఆరు గ్యారెంటీల కోసం తాము దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మంత్రివర్గ ఉపసంఘం స్పందించింది. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు సమర్పించని వారు…ఆందోళన చెందొద్దని… ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజా పాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల ఎంట్రీ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!