అయోధ్యలో తన జన్మస్థలం రామ మందిరంలోని గర్భ గుడిలో బాల రాముడు కొలువుదీరాడు. దీంతో కోట్లాది హిందువులు సంబరాలు జరుపుకున్నారు. రామ భక్తుల్లో సంతోషం వెల్లివిరిసింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో ప్రజలు కాషాయ రంగులో కనిపించారు. కొన్ని చోట్ల జై శ్రీరామ్ అంటూ ర్యాలీలను నిర్వహించారు. మరికొన్ని చోట్ల సంకీర్తనలు చేస్తూ సందడి చేశారు. అయోధ్యకు ఆనుకుని ఉన్న కాశీ కూడా మారిపోయి కనిపించింది. అందరి నోటి నుంచి ఒకే నామ స్మరణ జై శ్రీరామ్. రామ నామ జపంతో దేశం మారుమ్రోగింది.
Advertisement
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఈ వేడుకకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ హాజరు కావడంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహగానాలకు మరింత బలం చేకూరింది. అయితే మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రామ మందిర ప్రతిష్ట మహోత్సవానికి దాదాపు 8వేల మంది అతితులను శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, సాధువులున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష నేతలు కొందరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు.
Advertisement
ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ కి కేంద్రం నుంచి కానీ, నిర్వాహకుల నుంచి కానీ ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై మాత్రం ఎలాంటి సమాాచారం లేదు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల జాబితాలను ఖరారు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారని.. అధికారిక కార్యక్రమాలున్నాయని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి వంటి వారు రామమందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలు చేయడంతో కేంద్రం కూడా జగన్ కి ఆహ్వానం పలికిందని తెలుస్తోంది. జగన్ క్రైస్తవ మతం కావడంతో అయోధ్యకు వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చని.. ఇక ఇదే సమయంలో మైనార్టీ ఓట్లు గల్లంతు అవుతాయని.. ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటే.. బీజేపీకి దూరమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సీఎం జగన్ కి ఆహ్వానం అందిందా లేదా అనేది అధికారికంగా ప్రకటిస్తే కానీ అందరికీ తెలియదు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!