తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే సీఎంగా రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతో గవర్నర్, ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మిగిలిన కొంత మందిని నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. అయితే తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి తమిళి సై సౌందర్య రాజన్ ప్రసంగించారు. కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్ తమిళి సై.
Advertisement
ప్రధానంగా కొత్త ప్రభుత్వాన్ని శుభాకాంక్షలు చెబుతూ… కేసీఆర్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని.. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని విమర్శించారు గవర్నర్ తమిళిసై. గత పాలకులు అప్పులుచేసి.. తెలంగాణను ఆగం చేశారని బీఆర్ఎస్కు చురకలంటించారు గవర్నర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి అక్రమాలపై విచారణ చేపడతామని గవర్నర్ తమిళిసై చెప్పారు.
Advertisement
అదేవిధంగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం కృషి చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ మొదలయిందన్న తమిళిసై సౌందరరాజన్.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటినీ అమలు చేశామన్నారు. మిగతా గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై. ప్రజలు ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా పాలన ఉంటుందని తెలిపారు. అయితే గవర్నర్ ప్రసంగం గురించి బీఆర్ఎస్ కి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. గవర్నర్ ప్రసంగం గురించి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీతో పాటు అసెంబ్లీకి బయట కూడా ప్రెస్ మీట్స్ పెట్టి గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడటం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.