హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా నిలిచిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తెల్లారే సరికి నేల మట్టం అయింది. నామరూపాలు లేకుండా చరిత్రలో కలిసిపోయింది. గత 160 రోజుల నుంచి వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు గండికొట్టారు. హై కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా ప్రూట్ మార్కెట్‌ను కూల్చివేశారని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రూట్ మార్కెట్‌ను తెరవాలని మార్కెటింగ్ శాఖకు హై కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో.. మార్చి 04న సామాన్లు తీసుకోవడానికి తెరిచిన విషయం తెలిసినదే. తెరిచి ముచ్చటగా మూడు రోజులు కూడా గడవక ముందే మార్కెట్‌ను కూల్చివేశారు.
Advertisement
ముఖ్యంగా ఆదివారం రాత్రి గడ్డిఅన్నారం మార్కెట్ వద్ద హై డ్రామా కొనసాగింది. మూసివేసేందుకు అధికారుల రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య మార్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌ను కూల్చివేస్తున్నారని వ్యాపారులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి అడ్డుకునేందుకు యత్నించారు. కానీ పోలీసులు లాఠీ చార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉదయం 4 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు తెల్లారేసరికి నేలమట్టం చేశారు.
Advertisement
1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రజల కోసం 18 ఎకరాల విస్తీర్ణంలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను ఏర్పాటు చేసారు. అప్పటి నుండి రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు ఫ్రూట్ మార్కెట్ ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తూ వస్తుంది. 2020 లో మార్కెట్‌ను కోహెడకు తరలించింది. అక్కడ ఎటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయకపోవడంతో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా వేసిన షెడ్లు నేల కూలాయి. దీంతో తిరిగి ఫ్రూట్ మార్కెట్ ను గడ్డిఅన్నారం కు తరలించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెన్‌ను కొహెడకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు.
ఇక అప్పటి నుంచి మార్కెట్‌ను తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ.. చివరికి మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. దీంతో వ్యాపారులు తమకు కొహెడలో పూర్తి సౌకర్యాలు కల్పించకుండా వ్యాపారులకు హైకోర్టును ఆశ్రయించారు. చివరికి హైకోర్టు ఫ్రూట్ మార్కెట్‌ను తెరవాలంటూ వ్యాపారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులతో ఈనెల 04న మార్కెట్‌ను తెరిచిన అధికారులు మూడు రోజులు తిరగకుండా హైకోర్టు ఉత్తర్వులని లెక్కచేయకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
Also Read : మైదానంలో తిట్టుకున్న షేన్‌వార్న్.. ఆనాటి వీడియో ప్రస్తుతం వైరల్..!