తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు మిగిలింది కేవలం మూడు రోజులు మాత్రమే. అయితే ఈ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు సంచలనంగా మారారు. నిన్న మొన్నటి వరకు బర్రెలక్క పోటీని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆమె సంచలనం అనే చెప్పాలి. ఆమె పోటీలో నిలబడినా పోయేది ఏమి లేదనేది గతంలో మాట. కానీ ఇప్పుడు ఆమె పోటీకి ప్రాధాన్యత కీలకంగా మారింది. బర్రెలక్క పోటీతో ఎవ్వరికీ నష్టం జరుగుతుంది ? ఎవ్వరికీ ప్రయోజనం సమకూర్చుతుంది ? అనేది ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో పెను సంచలనంగా మారింది.
Advertisement
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బర్రెలక్కనే గెలిపించాలని స్వచ్ఛందంగా ప్రచారం చేసే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆమెను గెలుస్తారనే నమ్మకం ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. ఆమె గెలిస్తే.. రాష్ట్రంలో ఓ సంచలనమే అని చెప్పవచ్చు. ఒకవేళ ఆమె ఓటమి పాలైతే.. రెండు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటములను ఆమె పోటీ గణనీయంగా ప్రభావితం చేయనుందనే విశ్లేషణలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రచారం పరాకాష్టకు చేరిన నేపథ్యంలో నిరుద్యోగ సమస్య కీలకంగా ముందుకొచ్చింది. ఐటీ హబ్ వద్ద కేటీఆర్ నిరుద్యోగులతో మాట్లాడి వారికి హామీలు ఇచ్చిన వార్తపై సోషల్ మీడియాలో పలు విధాల వాదనలు జరిగాయి. ఇధే ధోరణీలో కాంగ్రెస్ కూడా నిరుద్యోగులను కలవాలనుకుంది. ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అశోక్ నగర్ అడ్డాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లారు. అక్కడ నిరుద్యోగులతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపు కాంగ్రెస్ కి వెళ్లే అవకాశాలున్నాయి.
Advertisement
ప్రభుత్వ వ్యతిరేకతతో నిరుద్యోగ అంశానిది ప్రధాన స్థానమని చెప్పాలి. బర్రెలక్క ఈ నిరుద్యోగం అనే అంశాన్నే బలంగా ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా నియమాకాలు చేపడితే తాను బరిలో ఉండేదానిని కాదని.. తన మేనిఫెస్టో లో నిరుద్యోగులకు సంబంధించిన విషయాలను ప్రధానంగా పేర్కొంది. దీంతో ఆమె పోటీకి ప్రాధాన్యత మరింత పెరిగింది. కొల్లాపూర్ లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్థన్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరి మధ్య పోటీ హోరా హోరీగా ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బర్రెలక్క కాంగ్రెస్ కి వెళ్లకుండా చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తానికి కొల్లాపూర్ నియోజకవర్గంలో బర్రెలక్క పోటీ ప్రధాన పార్టీలకు టెన్షన్ పుట్టిస్తుందనే చెప్పవచ్చు. ఈ నియోజకవర్గంలో ఎవ్వరూ గెలుస్తారోనని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.