ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వైసీపీ మంత్రులపై వస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినీ పై సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో అటు వైసీపీకి ఇటు విడుదల రజినీకి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా మంత్రి రజనీ పై వైసీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. మంత్రి విడదల రజినీ తనకు టికెట్ ఇప్పిస్తానని 6.5కోట్లు వసూలు చేసిందని చిలుకలూరిపేట నియోజకవర్గం సీటు విషయంలో విడదల రజినీ తనను మోసం చేసిందని మల్లెల రాజేష్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్న వేళ డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్న వ్యవహారం మల్లెల రాజేష్ నాయుడు వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ చార్జీలను మార్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మంత్రి విడదల రజినీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జీగా ప్రకటించి చిలుకలూరిపేట వైసీపీ ఇన్ చార్జీగా మల్లెల రాజేష్ నాయుడు ను ప్రకటించారు.
Advertisement
అయితే మల్లెలకు చిలుకలరిపేటలో గెలుపు అవకాశాలు లేకపోవడంతో మళ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీని మార్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడిని ఎన్నికల బరిలో నిలిపారు. దీంతో మల్లెల రాజేష్ నాయుడు తన దగ్గర డబ్బులు తీసుకొని విడుదల రజినీ మోసం చేసిందని ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం రూ.6.5కోట్లు తీసుకుందని సంచలన ఆరోపణలు చేసారు. ఇప్పుడు తన సీట్ ను వేరే వారికి కేటాయించడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి దాకా తీసుకెళ్లారు. ఆయన మధ్య వర్తిత్వంతో విడుదల రజినీ 3.5 కోట్లు తిరిగి ఇచ్చారని తెలిపారు రాజేష్ నాయుడు. విడద రజినీకి దమ్ముంటే చిలుకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో కావటి మనోహర్ నాయుడు స్థానిక వైసీపీ నేతలు సహకరించే అవకాశం లేదని మల్లెల రాజేష్ నాయుడు తేల్చి చెప్పాడు. మొత్తానికి చిలుకలూరి పేట రచ్చ మంత్రి విడుదల రజినీకి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారింది.