సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరుకే తెలుగు టీమ్ కానీ.. ఎప్పుడూ స్థానిక ఆటగాళ్లకు పెద్దగా అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. పేరులోని హైదరాబాద్ ఉంది తప్పా ఇక్కడి భాషను కల్చర్‌ను ఓన్ చేసుకుంది లేదు. ప్రతిసారి ఇదే తరహా వైఖరితో అభిమానులను నిరాశపరిచిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఈ సారి వేలంలో వింత ఎంపికలతో మరింత ఆశ్చర్యపరిచింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న స్థానిక ఆటగాళ్లు తిలక్ వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ది వైపు కన్నెత్తి కూడా చూడని సన్‌రైజర్స్.. ఒక్క తెలుగు ఆటగాడిని కూడా ఎంపిక చేసుకోలేదు.
Also Read : UDAYKIRAN : మూడు వరుస హిట్ల తరవాత బెదిరింపులు..ఉదయ్ కిరణ్ ఏం చేశాడంటే..!
Advertisement
వెటరన్ ప్లేయర్ అంబటి రాయుడు కోసం ప్రయత్నం చేయలేదు. అండర్ -19 స్టార్ షేక్ రషీద్‌ను కనుకరించలేదు. ఆంధ్ర క్రికెట్ కేఎస్ భరత్‌తో పాటు హరిశంకర్‌రెడ్డి వంటి ఆటగాళ్లను తీసుకోలేదు. ఐపీఎస్‌కే బ్రాండ్ అంబాసిడర్ అయిన డేవిడ్ వార్నర్ ను ఈగోకు పోయి వదులేసుకుంది. అలాగని ఆ స్థాయి ఆటగాడిని వేలం కొనుగోలు చేసిందా..? అంటే అది లేదు. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్ అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ దేశీవాళీ స్టార్లపైనా దృష్టి పెట్టలేదు. నిలకడలేని నికోలస్ పూరన్ కోసం రూ.10కోట్లకు పైగా వెచ్చించిన సన్‌రైజర్స్ మరొక రెండు కోట్లు వేస్తే శ్రేయాస్ అయ్యర్ దక్కే అవకాశమున్నా ఆ ప్రయత్నమే చేయలేదు.
గతంలో తమ జట్టుకు ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తిరిగి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. లీగ్ మొత్తంలో అత్యుత్తమ బౌలింగ్ దళంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ రషిద్‌ఖాన్ లాంటి ప్లేయర్‌ను కొనుగోలు చేయలేకపోయింది. గతంలో వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, రషీద్ ఖాన్, హోల్డర్ వంటి విదేశీ స్టార్లతో కళకళలాడిన రైజర్స్.. ఈసారి పేరున్న ఆటగాళ్ల జోలికే పోలేదు. పూరన్, మార్కరమ్ తప్ప మిగిలిన ఐదుగురు విదేశీ ఆటగాళ్లు అంతగా తెలియదు. సీన్ అబాట్, రొమారియా, షెఫర్డ్, జాన్‌సెన్, ఫిలిప్స్, ఫజల్లాఖ్ ఫారూఖీ వంటీ విదేశీ ఆటగాళ్ల పేర్లు అభిమానులకు పెద్దగా పరిచయం లేనవే అని చెప్పవచ్చు.
Advertisement
స్వదేశీ ఆటగాళ్లకైనా సరైన వాళ్లను ఎంపిక చేసుకున్నారా అంటే అది కూడా లేదు. పెద్ద మ్యాచ్‌లు ఆడిగన అనుభవం ఎక్కువ లేని అబ్దుల్ సమద్ను వేలానికి ముందే అట్టి పెట్టుకున్న రైజర్స్.. అభిషేక్ శర్మ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేసింది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న వాషింగ్టన్ సుందర్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ వాళ్లెవరినీ తీసుకోలేదు. కోల్‌కతా తరుపున కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి కోసం భారీ మొత్తాన్ని వెచ్చించిన టీమ్ మేనేజ్‌మెంట్ తుది జట్టులో ఉంటాడనే నమ్మకం లేని యువ పేసర్ కార్తీక్ త్యాగికి నాలుగు కోట్లు కట్టబెట్టింది.
ఇప్పటికే భారత జట్టుకు దాదాపుగా దూరమైన భువనేశ్వర్ కుమార్‌లో పాత మెరుపు లేకపోగా.. బౌలింగ్ భారం నటరాజన్‌పై పడేలా కనిపిస్తుంది. గాయం నుంచి కోలుకోని విలియమ్సన్ కు డిప్యూటీ ఎవరనే అంశంపై కూడా స్పష్టత లేదు. డేవిడ్ వార్నర్‌ను వదిలేసుకోవడంతోనే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా నిర్ణయాలతో వారికి మరింత దూరమైంది. తెలుగు ప్లేయర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ఫ్రాంచైజీలు తీసుకున్న ఆటగాళ్లు సన్‌రైజర్స్‌కు పనికి రావా..? అని ప్రశ్నిస్తున్నారు. అసలు తెలుగు జట్టు అని సన్‌రైజర్స్‌కు సపోర్ట్ చేయడమే మన తప్పిదమని కామెంట్లు చేస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు ఆటగాళ్లకు అవకాశం ఇవ్వని సన్‌రైజర్స్ హైదరాబాద్ అసలు తెలుగు టీమ్ కాదు అనే మండిపడుతున్నారు.