ప్రముఖ నటుడు రవికిషన్ తెలుగు, భోజ్ పురి, హిందీ భాషలో అనేక సినిమాలు చేశాడు. కానీ తెలుగువారికి మాత్రం ఇతడు రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డిగానే గుర్తుండిపోయాడు. సినిమాలతో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎంపీగా సేవలందిస్తున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినిమాలకు దూరం కాలేదు. ఇటీవలే లాపట్ట లేడీస్ అనే సినిమాలో కనిపించాడు.
Advertisement
తాజాగా అతడు తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘మా నాన్నకు కోపం చాలా ఎక్కువ. నన్ను చితక్కొట్టేవాడు.. సింపుల్గా చెప్పాలంటే చంపేందుకు కూడా వెనుకాడలేదు. అలా ఓ రోజు నన్ను చంపాలన్న కోపంతో కనిపించాడు. అది గమనించిన అమ్మ నన్ను పారిపోమని చెప్పింది. వెంటనే ఆలస్యం చేయకుండా రూ.500 జేబులో పెట్టుకుని ఇంట్లో నుంచి పారిపోయి ముంబై ట్రైన్ ఎక్కాను. నాన్న కోపం వెనక అర్థం ఉంది. ఆయనొక పూజారి. ఒక బ్రాహ్మణుడిగా తన కొడుకు కూడా పూజారే కావాలని ఆశపడ్డాడు. లేదంటే వ్యవసాయం చేయాలి, అదీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగిగానైనా స్థిరపడాలని ఆశించాడు. తన కుటుంబంలో ఒక ఆర్టిస్టు పుడతాడని అస్సలు ఊహించలేదు.
Advertisement
ఒకసారి నేను సీతలా వేషం వేసుకుని నటిస్తూ, డ్యాన్స్ చేస్తూ ఉంటే షాకైపోయాడు. అయితే అతడి దెబ్బల వల్లే నాకు జీవితమంటే ఏంటో తెలుసొచ్చింది. ప్రతి దండన ఒక పాఠమే అనుకున్నాను. తన వల్లే ఈ రోజు రవికిషన్ గా మీ ముందు నిలబడ్డాను. నేను నటుడిగా స్థిరపడ్డాక నా ఎదుగుదల చూసి ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన చావుకు దగ్గరైనప్పుడు కూడా నన్ను చూసి గర్వంగా ఉందని చెప్పి కన్నుమూశాడు’ అని ఎమోషనలయ్యాడు. కాగా రవికిషన్ ప్రస్తుతం ‘మామ్లా లీగల్ హై’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతోంది.
Also Read : ఆ సమయంలో అమెరికా వెళ్లడానికి కారణం అదే.. అవంతిక కామెంట్స్ వైరల్..!