తెలంగాణలోని జిల్లాల పునర్విభజనపై రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా కొంతమంది ప్రయోజనం కోసం హాడావుడిగా కొత్త జిల్లాలను ప్రకటించారన్నారు. ఆదివారం కరీంనగర్ లో మీడియా చిట్ చాట్ పాల్గొన్న ఆయన.. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనదంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Advertisement
Advertisement
జిల్లాల పునర్విభజన పూర్తి అశాస్త్రీయంగా జరిగింది. ప్రజల అభిప్రాయాల మేరకు మరోసారి జిల్లాల, నియోజకవర్గాల మండలాల పునర్విభజన జరగాల్సిన అవసరం ఉంది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీ వేసి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేసి.. ప్రజలు కోరుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆర్టీసీని గత ప్రభుత్వం చంపేసిందని చెప్పిన ఆయన.. త్వరలోనే ఆర్టీసి ప్రయాణీకుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అన్యాయానికి గురైన వారు ఫిర్యాదు చేయాలని, వాటిపై చర్యలు చేపడతామని క్లారిటీ ఇచ్చారు.
సీఎం పదవి ఎడమ కాలు చెప్పుతో సమానం అని తండ్రి అంటే.. కొడుకు సీఎం పదం కంటే కేసీఆర్ పదం పవర్ అంటాడని ఎద్దేవా చేశారు. జీవితంలో ఎప్పుడూ కూడ బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేయవని స్పష్టం చేశారు. దేశం కోసం ఎవరు ఏం చేశారో తెలుసని, దేశ సంపద కాంగ్రెస్ సృష్టిస్తే బిజేపి అమ్ముతుందన్నారు. పెళ్ళాం పుస్తెలు అమ్మి ఎన్నికల్లో కొట్లాడిన వ్యక్తి బండి సంజయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.