Home » త్రివిక్ర‌మ్ కు ఇష్ట‌మైన “ప్రాగ్దిశ వీణియ పైన” అనే పాట వివ‌ర‌ణ‌ మీకోసం!

త్రివిక్ర‌మ్ కు ఇష్ట‌మైన “ప్రాగ్దిశ వీణియ పైన” అనే పాట వివ‌ర‌ణ‌ మీకోసం!

by Azhar
Ad

కె. విశ్వ‌నాథ్ డైరెక్ష‌న్ లో 1986లో విడుద‌లైన చిత్రం సిరివెన్నెల‌. ఈ సినిమాలోని పాటలన్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఇదే ఆయ‌న‌కు మొద‌టి సినిమా అందుకే ఈ సినిమా త‌ర్వాత సీతారామ‌శాస్త్రి పేరు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అయ్యింది. విధాత తలపున ప్రభవించినదీ అనే పాటకు సీతారామ శాస్త్రి ఉత్తమ గేయరచయితగా నంది అవార్డ్ అందుకున్నారు. ఈ పాట డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కు చాలా ఇష్ట‌మైన పాట‌!

Advertisement

ఆ పాట పూర్తి వివ‌ర‌ణ ఇప్పుడు మీకోసం

  • విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం…ఓం = ఈ అనంతమైన విశ్వం ఉద్భవించడానికి మూలమైన విధాత (క్రియేటర్) ఎవరున్నారో… ఆయన ఆలోచనల్లో కదలాడి పుట్టుకొచ్చిన అనాది జీవన వేదమే ఓం.
  • ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్…ఓం = మనం పుట్టాక…మన ప్రాణ నాడులన్నీ ఓ రకమైన స్తబ్దత ను అలుముకుని ఉంటాయి. వాటిలో స్పందనను తీసుకు వచ్చి… మనల్ని చైతన్యపరిచే…తొలి ప్రణవ నాదమే ఓం.
  • కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం = ఆ ప్రణవ నాదం ఎలా ఉంటుందంటే…. మన కనుల కొలనులో విశ్వరూప విన్యాసంగా ప్రతిబింబిస్తూ ఉంటుందంట.
  • ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్ = ఇంకా లోతుగా పరిశీలిస్తే… మన హృదయాంతరాల్లో ఆ సృష్టికర్త చేసే వీణాగానం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందంట.
  • సరస స్వర సుర ఝరీగమనమౌ సామ వేద సార మిది…నేపాడిన జీవన గీతం ఈ… గీతం   =ఆ సంగీత ధార ఎలాంటిదంటే…సరస స్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమంట. సరస స్వరం అంటే aesthetic music అనుకోవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ సంగీత ప్రవాహమే…సామవేదానికి సారం అని రాశారు శాస్త్రి గారు. ఈ గీతం.. మన అందరి జీవితం అని పల్లవి లోనే జ్ఞాన బోధ చేశారు.

Advertisement

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం..
సృష్టికర్త పాత్రనై ఈ కవనాన్ని రాసిన నేనే… విపంచి అంటే వీణ…వీణానాదంగా మారి అందరికీ వినిపిస్తున్నాను.
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా.
సంగీతం ఎలా ఉద్భవించిందయ్యా అంటే…
ప్రాగ్దిశ వీణియపైన…అంటే సూర్యోదయం వేళ తూర్పుని ఒక వీణగా భావిస్తే… అక్కడి నుంచి సంగీతం ఉద్బవించింది అట. మరి వీణ అన్నారు… తీగలు లేవా అని వెటకారం ఆడతామేమో అని.. దినకర మయూఖ తంత్రుల పైన అన్నారు…ఆ వీణకి తీగలు ఏంట్రా అంటే… దినకర మయూఖములు అంటే… సూర్యుని కిరణాలు.
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన…
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే… మాములుగా పక్షులు.. రాత్రిళ్ళు చెట్లపైన గూళ్ళు కట్టుకుని ఉంటాయి అనుకుందాం. కానీ అవి మెలకువగా ఉన్నప్పుడు ఆహారాన్వేషణలో గుంపులు గుంపులుగా వినీలాకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి.వెళుతూ వెళుతూ ఆ విహంగాలు చేసే కిలకిలారావాలే…ఆ రిథమే.. సంగీతంగా మారి ఈ చరాచర సృష్టిని జాగృతం చేస్తోందట.
  • విశ్వకావ్యమునకిది భాష్యముగా… =  అనంతమైన ఈ సృష్టి చరిత్రకు…బాష్యంగా నిలుస్తోందట.
  • జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం = అప్పుడే పుట్టిన శిశువు గుక్క పట్టి తీసే రాగమూ సంగీతమే.
  • చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం = అలా చేతన పొందిన అనుభూతి దాని తాలూకు సవ్వడి ఎలా ఉందంటే.. హృదయ మృదంగ ధ్వానం లా ఉందట.
  • అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా.. సాగిన సృష్టి విలాసము నే = ఆ అనాది రాగం… ఆది తాళము తో… మనిషి జీవితం ఓ పరమ పవిత్రమైన నదిగా మారి… అనంత జీవన వాహినిలా ప్రవహిస్తూ ఉంటుందంట.
నా ఉచ్ఛ్వాసం కవనం
నా నిశ్వాసం గానం 
అంతటి పవిత్రమైన సంగీతమే ఈ కవితాగానంగా రూపు దిద్దుకుని… తన ఊపిరిగా మారిందని కవి హృదయం.
Credits : నెక్కంటి శ్రీహర్ష గారు
Visitors Are Also Reading