టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నాడని ప్రచారం జోరుగా సాగుతుంది. యువరాజ్ పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా యువరాజ్ తల్లి షబ్నమ్ తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం వాస్తవమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Advertisement
ఈ విషయం పై యువీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్ పూర్ ఎంపీగా సినీనటుడుగా సన్నిడియోల్ ఉన్నాడు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డియోల్ భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మరో సినీ నటుడు కూడా ఎంపీగా గెలిచాడు. మునుపటి తరం బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కూడా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పలుమార్లు విజయం సాధించారు. 1998, 1999, 2004, 2014 ఎన్నికల్లో వినోద్ ఖన్నా గురుదాస్ పూర్ ఎంపీగా గెలిచాడు. ఈ నియోజకవర్గం భారత్-పాకిస్తాన్ బోర్డర్ ను ఆనుకొని ఉంటుంది.
Advertisement
భారత క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఏమి కొత్త విషయం కాదు. గతంలో చాలా మంది లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. కొందరూ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్భనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నాడు. లోక్ సభ విషయానికి వస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్భజన్ సింగ్ సమకాలీకులే కావడం గమనార్హం.
Also Read : జూనియర్ విరాట్ ‘అకాయ్’ పేరు అర్థం ఏంటో తెలుసా ?