Home » దారుణం : కులం నుంచి అన్నదమ్ముల బహిష్కరణ.. 50వేలు జ‌రిమానా..?

దారుణం : కులం నుంచి అన్నదమ్ముల బహిష్కరణ.. 50వేలు జ‌రిమానా..?

by Bunty
Ad

తమ మాట వినడం లేదనే కారణంతో కుటుంబాలను కులం నుంచి, గ్రామం నుంచి బహిష్కరిస్తున్న ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. సుల్తానాబాద్‌ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్‌ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు. సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. ఆ స్థలాన్ని 2008లో రిజిస్ట్రేషన్‌ చేయించగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు అబ్దుల్‌అలీ చనిపోయాడు.

Advertisement

Advertisement

ఈ త‌రుణంలోనే ఆ భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉండ‌డంతో ఆగ్రహించిన కులపెద్దలు.. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని పంచాయితీ పెట్టారు. తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తమ తప్పు లేదని ముగ్గురు అన్నదమ్ములు మొత్తుకున్న పెద్దలు వినిపించుకోలేదు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో ఆ కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు.

డిసెంబర్ 01 న బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్లగా కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వెళ్లాకే అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, తమ కులపోళ్లు పాలు పోయకపోవడంతో రోజూ సుల్తానాబాద్‌ నుంచి తెచ్చుకుంటున్నామని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మూడు రోజులుగా న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని సమ్మయ్య వాపోతున్నాడు.

 

Visitors Are Also Reading