సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి మరి కొందరు సినీ పెద్దలతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో చిరంజీవి జగన్ తో మాట్లాడిన తీరు పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి తన స్థాయిని మరిచి అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదన్నారు. దీనికి సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ ఓ వీడియోను విడుదల చేశారు. సీఎంతో భేటీ తర్వాత అంతా బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు. ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసినందుకు చిరంజీవి కి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా తాము భావిస్తున్నామని ఆయనకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందని అన్నారు. స్వతహాగా చిరంజీవి చాలా పెద్ద మనిషి అని ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా కూడా సీఎం దగ్గరకు వెళ్ళారు అని అన్నారు. చిరంజీవి మాట్లాడుతున్న వీడియో చూసినప్పుడు తనకు చాలా బాధేసిందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టి ఆర్జించినట్టుగా ఉందని…. ఆయన అలా అడగటం చూసి ఇలాంటి దారుణమైన స్థితిలో మనం ఉన్నామా అని బాధ వేసింది అన్నారు.
Advertisement
Advertisement
ఈ సమావేశంలో కేవలం టికెట్ ధర గురించే తప్ప ఇతర సమస్యల గురించి ప్రస్తావించలేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. సినిమాలు రిలీజ్ అవ్వకపోవడానికి కరోనా కారణం అని వ్యాఖ్యానించారు. కానీ టికెట్ ధరలు కారణంగా సినిమా విడుదల ఆగిపోయిందని చిరంజీవి చెప్పడం బాధాకరమని అన్నారు.
ప్రస్తుతమున్న టికెట్ ధరలతోనే సినిమాలు మంచి వసూళ్లను సాధించాయి అన్నారు. మరో 20 నుండి 25 కోట్ల అధిక వసూలు కోసం ఇండస్ట్రీ దిగ్గజాలుగా ఉన్నవారు రిక్వెస్ట్ చేయడం అవసరం లేదన్నారు. చిరంజీవి లాంటి వాళ్ళు అలా అడగటం బాధించిందని మనం శాసించేవాళ్ళం కాకపోయినా ట్యాక్స్ లు కట్టేవాళ్ళం అని అన్నారు. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూనే మాట్లాడాలని హితవు పలికారు.