నైపుణ్యం ఉన్నవారు ఉత్సవాలు, జాతరల సమయంలో నోట్లో కిరోసిన్ పోసుకుని దాంతో గాల్లో మంటలు పుట్టిస్తారు. అయితే కిరోసిన్ కు పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే కాస్త మండే గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపుగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవు. అంతే కాకుండా అప్పటికే వారికి నైపుణ్యం ఉంటుంది కాబట్టి నోట్లోకి ఎంత కిరోసిన్ తీసుకోవాలి..ఎంత దూరంలో కాగడం పట్టుకుని ఊదాలి అన్నదానిపై స్పష్టత ఉంటుంది. ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కొందరు ఉత్సవాల్లో హీరో అయిపోవాలని తాము కూడా ఇలాంటి విన్యాసాలు చేస్తారు.
అలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ప్రాణం పోయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…విశాఖపట్నంలో తాజాగా ఉత్సవాలు నిర్వహించగా ఓ వ్యక్తి డీజిల్ తో విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. విగ్రహ ఊరేగింపు సమయంలో భక్తులంతా నృత్యాలు చేస్తూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలోనే సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని నిప్పుతో సాహసాలు చేశాడు. కాగడం చేతిలో పట్టుకుని డీజిల్ నోటినిండా నింపుకుని కాగడంపై ఊదాడు. దాంతో కాగడానికి ఉన్న మంటలు అతడి ముకం వరకూ వ్యాపించాయి.
Advertisement
Advertisement
దాంతో అక్కడే ఉన్న స్థానికులు అతడిని రక్షించేందుకు ఒక్కసారిగా వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న డీజిల్ బాటిల్ కాస్తా కిందపడి అతడి ఒళ్లంతా మంటలు అంటుకున్నాయి. దాంతో వెంటనే నానా తంటాలు పడి స్థానికులు ఆ మంటలు ఆర్పేశారు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎలాంటి నైపుణ్యం లేకుండా డీజిల్ తో విన్యాసాలు చేయడం వల్లే సంతోష్ కు నిప్పంటుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటన జరిగి కొన్ని రోజులు గడవగా ఉత్సవాల్లో తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో వెలుగులోకి వచ్చింది.