విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ మంగలగిరిలో జనసేనని పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరమని ఎద్దేవా చేశారు. ప్రతి ప్రజా సమస్య పైనా జనసేన పోరాడుతుంది.. కానీ జనసేనకు ఓట్లేయరని.. నా ఆర్ధిక మూలాలు దెబ్బ తీసేందుకు నా సినిమా ఆపేశారని మండిపడ్డారు. “నా ఆర్ధిక మూలాలు దెబ్బ తీస్తే ప్రజా సమస్యలపై మాట్లాడ్డం మానేస్తానా..?అవసరమైతే ఏపీలో నా సినిమాలు ఉచితంగా చూపిస్తా” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Advertisement
Advertisement
2024 వరకు వైసీపీ అరచకలను అన్నీ భరించాలని.. అప్పటి వరకు గుండాయిజం, రౌడీయిజం, బూతులు అన్ని భరించాలని అన్నారు పవన్. 2024 తర్వాత అన్నింటికి సమాధానం చెబుతానని.. ఓట్లు చీలకూడదని 2014లో పోటీ పెట్టలేదని.. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థినైనా నేను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అల్టిమేటమ్ ఇవ్వలేనని పేర్కొన్నారు. 151 స్థానాలున్న వైసీపీకి నేను ఎలా అల్టిమేటమ్ ఇవ్వగలను..? నా పోరాటం నా కోసం కాదు.. ప్రజల కోసం.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమని పవన్ వెల్లడించారు. పోరాటం నా కోసమే అయితే.. ఏదో పార్టీలో చేరేవాణ్ని.. కేంద్ర మంత్రిగా ఉండేవాడినని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే వైసీపీనే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను ఆపడం మా చేతుల్లో లేదని చెబుతోన్న వైసీపీ.. కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రైవేటీకరణ ఆపుతామని ఎందుకు ప్రచారం చేసింది..? అని ఫైర్ అయ్యారు పవన్. ప్రైవేటీకరణను ఆపుతామనే అజెండాతో కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓట్లు ఎందుకు వేయించుకున్నారు..? అని.. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉంటే ఇక్కడ దీక్ష ఎందుకు అని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలర్పించింది గుంటూరు జిల్లాకు చెందిన మహనీయుడేనని వైసీపీకి గుర్తులేదా..? అని నిలదీశారు. విశాఖలో దీక్ష పెడితే తాడేపల్లిలో ఉన్న వారికి వినబడదేమోనని.. అమరావతిలో దీక్ష చేపట్టానని.. స్టీల్ ప్లాంటుకు అప్పుంది కాబట్టే అమ్మేస్తామనే వాదన నిజమైతే.. ఏపీకి రూ. 6 లక్షలు కోట్ల అప్పుంది.. మరి ఏపీని అమ్మేయాలా..? అని అగ్రహించారు. గతంలో పాదయాత్రలు చేశారుగా.. మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా చేయండని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పాదయాత్ర చేస్తే నేనే మొదటగా సంఘీభావం తెలుపుతానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.