కమర్షియల్ సినిమా అంటే ఏంటో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమాగా NTR అడవిరాముడు నిలిచిపోయింది! NTR పని అయిపోయిందనుకుంటున్న తరుణంలో NTR రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా ఇది. కె.రాఘవేంద్రరావ్ డైరెక్షన్ లో NTR, జయప్రద, జయసుధలు హీరోహీరోయిన్స్ గా వచ్చిన ఈ సినిమా షూటింగ్ నుండి కలెక్షన్స్ వరకు అంతా ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.
అప్పటివరకు పౌరాణిక పాత్రలు చేసిన NTR ను సాంఘిక పాత్రలో చూపించేందుకు కన్నడలో రాజ్ కుమార్ నటించిన గంధడగుడి సినిమా స్పూర్తితో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకున్నారు సత్యచిత్ర బ్యానర్ వాళ్లు. డైరెక్టర్ గా రాఘవేందరావ్ ఫిక్స్.
Advertisement
షూటిగ్ కోసం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మధుమలై ఫారెస్ట్ ను లొకేషన్ గా ఎంచుకున్నారు. 45 రోజుల పాటు సినిమా షూటింగ్ అంతా మధుమలై ఫారెస్ట్ లో జరిగింది. అప్పటివరకు మద్రాస్ విడిచి 10 రోజులు కూడా లేని NTR ఈ సినిమా కోసం 35 రోజులు మధుమలై ఫారెస్ట్ లోని గెస్ట్ హౌస్ లో ఉన్నారు.
ప్రత్యేక పర్మీషన్ :
ఆ అడవిలో గవర్నమెంట్ కు చెందిన 3 కాటేజ్ లు మాత్రమే ఉండేవి. వాటిలోనే నటీనటులకు బస ఏర్పాటు చేశారు. చిత్ర యూనిట్ లో దాదాపు 350 మంది ఉండేవాళ్లు వారికోసం ప్రత్యేక అనుమతి తీసుకొని మరికొన్ని తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేయడమే కాకుండా నీటి, కరెంట్ వసతిని కూడా కల్పించారు నిర్మాతలు. సెట్స్ కోసం కార్పెంటర్లు, పెయింటర్లు, మౌల్డర్లను అక్కడికే తీసుకెళ్లి వారితో పనిచేయించుకున్నారు. ఏ వస్తువు కావాలన్నా మైసూర్ వరకు వెళ్లేవారు.
షూటింగ్ లో ప్రమాదం :
ఈ సినిమా కోసం మద్రాస్ చిత్రా సర్కస్ నుండి 3 ఏనుగులను తీసుకున్నారు. హీరోయిన్ జయప్రద, జయసుధలు ఏనుగు మీద ఉన్నప్పుడు విలన్లు పెద్ద పెద్ద కర్రలతో శబ్దాలు చేస్తూ హీరోయిన్స్ ను తరమాలి…ఈ సందర్భంగా వారి అరుపులకు భయపడిన ఏనుగు జయప్రద, జయసుధలను చెరో వైపు తోసేసింది. వారిద్దరూ చెట్ల తుప్పల్లో పడడంతో ప్రమాదం తప్పింది. జయప్రద స్ప్రుహ తప్పిపోయింది.
Advertisement
ఇక మరుసటి రోజు షూటింగ్ లో జయప్రద ప్రయాణిస్తున్న గుర్రపుబండి చక్రం ఊడడంతో మరోసారి కిందపడిన జయప్రద పక్కటెముకలకు దెబ్బ తగిలింది. జయప్రదకు అదే మొదటి సినిమా కావడం పైగా NTRతో కో యాక్టర్ గా నటించడంతో వాటిని లెక్కచేయకుండా షూటింగ్ ను కంటిన్యూ చేసింది.
NTR తొలి సినిమా స్కోప్ ఇది :
అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం తర్వాత మూడవ సినిమా స్కోప్ చిత్రం ఇది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం ప్రసాద్ ల్యాబ్స్ వాళ్లు ప్రత్యేక లెన్స్ ను జపాన్ నుండి దిగుమతి చేసుకున్నారు అదే లెన్స్ ఈ సినిమాకు వాడారు.
NTR కాస్ట్యూమ్స్ :
ఈ సినిమాలో NTR లుక్ పూర్తిగా మారిపోయింది. దానికి కారణం వారి కాస్ట్యూమ్స్ అని చెప్పాలి. విజయవాడ యాక్స్ టైలర్స్ NTR కోసం పెద్ద కాలర్ షర్ట్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పాటల్లో వివిధ కాస్ట్యూమ్స్ తో NTR ను మరింత అందంగా చూపించారు.
క్లైమాక్స్ :
అప్పటి వరకు క్లైమాక్స్ అంటే సినిమాకు ముగింపుగా మాత్రమే ఉండేది ఈ సినిమా కోసం క్లైమాక్స్ ను ఓ రిచ్ ఎపిసోడ్ లాగా చిత్రీకరించారు. సింహంతో NTR ఫైటింగ్, గుర్రపు బండి ఛేజింగ్, గుర్రపు బండి లోయలో పడే సీన్ …కెమెరామెన్ విన్సెంట్ అద్భుత పనితీరుకు నిదర్శనాలు.
రికార్డులు :
25 లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా 3 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజులకే 1 కోటి కలెక్ట్ చేసిన మొదటి చిత్రం ఇదే. ఇంకా అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా! ఈ సినిమా తర్వాత NTR రాఘవేంద్రరావ్ కాంబినేషన్ లో 11 సినిమాలు వచ్చాయి.