రిలయన్స్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ భారత్ విడిచి లండన్ కు మకాం మారుస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముకేశ్ అంబానీ కుటుంబంతో సహా లండన్ వెళ్తున్నారని అక్కడే స్టోక్ పార్క్ ఎస్టేట్ లో ఆయన కుటుంబంతో ఉంటారని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను రిలయన్స్ గ్రూప్ సంస్థ ఖండించింది. ఈ మేరకు రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఒక వార్తా పత్రికలో..మరియు సోషల్ మీడియాలో ఇటీవల ముకేశ్ అంబానీ కుటుంబం లండన్ లోని స్టోక్ పార్క్ లో పాక్షికంగా నివాసం ఏర్పరుచుకుంటుందని ప్రచారం జరిగిందని…ఆ వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అంబానీ అతని కుటుంబ సభ్యులు లండన్ లేదా ప్రపంచంలో ఎక్కడికీ కూడా మకాం మార్చడం లేదని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది.
Advertisement
రిలయన్స్ గ్రూప్ సంస్థ లండన్ లోని స్టోక్ పార్క్ లో 300 ఎకరాల ఎస్టేట్ ను కొనుగోలు చేసిన వార్త నిజమేనని పేర్కొంది. అయితే అది అంబానీ కుటుంబం నివాసం ఉండేందుకు కాదని వెల్లడించింది. ఆ స్థలాన్ని ఒక ప్రీమియర్ గోల్ఫింగ్ మరియు స్పోర్టింగ్ రిసార్ట్ గా అభివృద్ధి చేస్తామని పేర్కొంది. అంతే కాకుండా రిలయన్స్ సంస్థ సేవలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడమే తమ ఆలోయన అని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే ముఖేష్ అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని ముంబైలో 40 వేల చదరపు అడుగులతో అల్ట్రా మౌంట్ రోడ్డు లో నివాసం ఉంటున్నారు.
Advertisement
అయితే రిలయన్స్ సంస్థ లండన్ లోని స్టోక్ పార్క్ లో 300 ఎకరాల కంట్రీ క్లబ్ ను కొనుగోలు చేసింది. దాంతో అంబానీ లండన్ కు షిఫ్ట్ అవుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రమే లండన్ లో స్థలాన్ని కొనుగోలు చేశామని రిలయన్స్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. ఇక భారత్ లో రిలయన్స్ సంస్థ వ్యాపారాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యావసరాల నుండి మొదలుకుని చమురు, ఎలక్ట్రానిక్, టెలికాం ఇతర రంగాల్లోనూ రిలయన్స్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.