రాజ్ కోట్ లో ఇవాళ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ కి మూడో టెస్ట్ తొలి రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తన కారణంగా రనౌట్ అయిన ఆరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. తొలి మ్యాచ్ లో అదురగొట్టినందుకు సర్ఫరాజ్ ను ఆకాశానికెత్తాడు.
Advertisement
మ్యాచ్ ముగిసిన అనంతరం జడేజా తన ఇన్ స్టా స్టోరీలో క్షమాపణ, అభినందన సందేశాన్ని షేర్ చేశాడు. సర్ఫరాజ్ విషయంలో చాలా బాధగా ఉంది. తప్పు నాదే.. లేని పరుగు కోసం పిలుపునిచ్చాను. చాలా బాగా ఆడావు సర్ఫరాజ్ అంటూ జడేజా తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. మరోవైపు ఈ రనౌట్ గురించి సర్ఫరాజ్ ఖాన్ కూడా స్పందించాడు. మిస్ కమ్యూనికేషన్ వల్లనే అలా జరిగింది. జడ్డూ బాయ్ నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. పర్లేదు అని నేను చెప్పాను. క్రీజ్ లో ఉన్నంత సేపు అతను నాకు అండగా నిలిచాడు. విలువైన సలహాలు ఇచ్చి నన్ను గైడ్ చేశాడని తెలిపాడు.
Advertisement
మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా పై చేయి సాధించింది. రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110 నాటౌట్) సెంచరీలు చేసి భారత జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఆరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మెరుపు అర్థశతకం(62) తోడైంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 5 వికెట్లు నష్టానికి 326 పరుగులు చేసింది.
Also Read : ఫస్ట్ మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్