శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తులు మాలను ధరించి 41 రోజులపాటు కఠోర దీక్ష చేస్తారు. అదేవిధంగా కఠిన దీక్షచేసి, ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకుంటారు. తలపై ఇరుముడితో పావన పదునెట్టాంబడి ఎక్కి, స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప దీక్షలో గురుస్వాములు పాత్ర కీలకమైనది. గురుస్వాములపై గురుతర బాధ్యతలుంటాయి. గురుస్వామి సమక్షంలో మాలను ధరిస్తారు. అయ్యప్పస్వామి మూల మంత్రాన్ని గురుస్వామే ఉపదేశిస్తారు. తొలిసారి మాల ధరించిన కన్నెస్వాములు దీక్షా సమయంలో ఆచరించాల్సిన నియమ, నిబంధనలు గురించి గురుస్వాములే వివరిస్తారు.
Advertisement
Advertisement
దీక్ష ప్రారంభమైన రోజు నుంచి యాత్ర పూర్తయ్యే వరకూ గురుస్వామి ఇతర మాలధారులకు దీక్ష పవిత్రతను తెలపడంతో పాటు సంరక్షకుడిగా భావించొచ్చు. దాదాపు 18 సంవత్సరాల కాలం పాటు పవిత్ర శబరిమల యాత్రను చేసిన వారిని గురుస్వామిగా గుర్తిస్తారు. 18 పర్యాయాలు మాల ధరించి, శబరిమలకు వెళ్లిన స్వాములు దేవస్థానవనంలో కొబ్బరి మొక్కను నాటుతారు. మాలధారణ చేసిన వారందరికీ శబరి యాత్ర చేయించడానికి, కన్నెస్వాములకు మార్గదర్శనం చేస్తూ గురుస్థానంలో ముందుండాలి. ఇరుముడి, అభిషేకాలతోపాటు అయ్యప్ప దర్శనం చేయించడంలోనూ గురుస్వామి ఇతర స్వాములకు గురువులా ఉంటారు. యాత్ర తిరుగు ప్రయాణంలో కూడా అవకాశాన్ని బట్టి తన శిష్యుల కోరిక మేరకు తీర్థయాత్రలు చేయించాలి.
అదేవిధంగా పీఠానికి వచ్చి గురుస్వామి సమక్షంలో మాల విసర్జన చేయడంప సూచనలు కూడా చేస్తారు. ఇవన్నీ కార్యక్రమాలు గురుస్వామి సమక్షంలోనే జరగాలి. మొదటిసారి మాల వేసేవారిని కన్నెస్వాములని పిలుస్తారు. వీరికి దీక్ష సమయంలో ప్రతీ అంశాన్ని గురుస్వామి క్షుణ్ణంగా బోధిస్తుంటాడు. ఇరుముడి నుంచి యాత్రపూర్తయి మాల విసర్జన చేసేంత వరకు గురుస్వామి సూచనలను మిగిలిన స్వాములు పాటిస్తారు. అరణ్య ప్రాంతంలో కొండలపై ఉన్న శ్రీ అయ్యప్పస్వామి క్షేత్రాన్ని 18 సార్లు దర్శించుకున్న స్వాములపై హరిహరసుతుడి కటాక్షం లభిస్తుంది.